Hyd, Dec 1: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయాలని తెలిపింది.
మెయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కోసం ఈ ముగ్గురు బేరసారాలు చేసారనే అభియోగం తో వీరిని అరెస్ట్ చేసారు. దాదాపు నెల రోజులుగా వీరు రిమాండ్ లో ఉన్నారు. రాజకీయంగా సంచలనానికి కారణమైన ఈ ముగ్గురు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ ముగ్గురు జరిపిన సంభాషనల వీడియోలను సీఎం కేసీఆర్ స్వయంగా బయట పెట్టారు. బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ తో పాటుగా మరి కొందరి పేర్లను వీరు ప్రస్తావించటం సంచలనంగా మారింది. ఇక, ఇప్పుడు ఈ ముగ్గురికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కేసులో ఏ2గా ఉన్న నందకుమార్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎల్. రవి చందర్ వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వులను నిందితుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందుంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరికి ఎవరి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ చేసారు. వీరితో పాటుగా ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.