Hyd, Sep 4: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు (IMD Weather Alert) అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సుంది.
ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అల్పపీడనానికి (Low pressure in Bay of Bengal)సంబంధించిన వివరాలతో వాతావరణ శాఖ పూర్తిస్థాయి బులెటిన్‌ను త్వరలో విడుదల చేయనుంది.
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడి తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ఏపీలోని విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంపునకు గురైన విజయవాడ తదితర ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే మరో తుపాను ముప్పుందని (another threat to Telugu states) వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటం ఏపీ వాసులను కలవరపెడుతోంది.
ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగా పడుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన అపార్టుమెంట్ల సెల్లార్‌లు
ఎగువ ప్రాంతం భద్రాచలం వద్ద 42.2అడుగుల నీటిమట్టం కొనసాగుతోందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 3,05,043లక్షలు కాగా.. ఔట్ ఫ్లో 3,12,057లక్షల క్యూసెక్కులు ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ హెచ్చరించారు.
మరోవైపు రాజమహేంద్రవరంతోపాటు తూ.గో.వ్యాప్తంగా ఉదయం నుంచీ ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే వరద బాధితులకు ఆహారం పంపిణీ చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుందని ఆమె చెప్పారు. ఇవాళ సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుందని చెప్పారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.