Hyderabad, JAN 23: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ (Indiramma Illu Housing Scheme) ఒకటి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు కోరగా.. పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ స్కీమ్ 2025 (Indiramma Illu Housing Scheme) తుది లబ్దిదారుల జాబితాను అధికారిక వెబ్ సైట్ (indirammaindlu.telangana.gov.in) లో ప్రభుత్వం విడుదల చేసింది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ -1 కింద రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
మార్చి 11, 2024న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ప్రారంభించారు. పేదలకు తక్కువ ధరకే గృహ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తొలి దశలో ట్రాన్స్‌జెండర్లు, పారిశుధ్య కార్మికులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ పథకం కింద లబ్దిదారులు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5లక్షలు సాయం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం 22వేల కోట్ల రూపాయలు కేటాయించింది.
ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ లిస్ట్ 2025.. ఇలా చెక్ చేసుకోండి..
* స్కీమ్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి (https://indirammaindlu.telangana.gov.in/)
* అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
* మీ మొబైల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ లేదా ఎఫ్ఎస్ సీ కార్డ్ ఎంటర్ చేయాలి
* వివరాలన్నీ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
* ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్డ్ లిస్ట్ కనిపిస్తుంది.
ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ లిస్ట్ 2025 స్టేటస్.. ఇలా చెక్ చేసుకోండి..
* అధికారిక వెబ్ సైట్ కు(https://indirammaindlu.telangana.gov.in/) వెళ్లాలి
* బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
* ఆ బాక్స్ లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి
* వివరాలన్నీ ఎంటర్ చేశాక, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ కి ఎవరెవరు అర్హులు..
* తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న వారు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు
* ఇళ్లు లేని పేదలు అర్హులు
* ఆర్థికంగా వెనుకబడిన వారు
* ఇతర హౌసింగ్ స్కీమ్ ల నుంచి లబ్ది పొంది ఉండకూడదు
అవసరమైన డాక్యుమెంట్స్..
* ఆధార్ కార్డ్ కాపీ
* మొబైల్ నెంబర్
* అడ్రస్ ప్రూఫ్
* రేషన్ కార్డ్
* దరఖాస్తు చేసుకునే వ్యక్తి పాన్ కార్డ్
ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు, స్థలం లేని వారికి స్థలంతో పాటు రూ.5లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు తొలిదశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో దశలో స్థలం లేని వారిని కూడా గుర్తించి స్థలం కేటాయింపుతో పాటు ఇళ్లు మంజూరు చేయనుంది. తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 3వేల 500 ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నాలుగు దశల్లో బిల్లు మంజూరు..
* పునాది పూర్తి కాగానే లక్ష రూపాయలు
* గోడలు నిర్మించాక రూ.1.25 లక్షలు
* స్లాబ్ సమయంలో రూ.1.75 లక్షలు
* నిర్మాణం పూర్తైన తర్వాత మరో లక్ష రూపాయలు అందజేత