Hyd, Sep 30: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో (Jubilee Hills Gang Rape Case) జువైనల్ జస్టిస్ బోర్డు కీలక తీర్పు వెల్లడించింది. అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. జువైనల్ సెక్షన్ 15 ప్రకారం.. నలుగురు మేజర్లుగా బోర్టు (Juvenile Justice Board) అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యుల నివేదికను ట్రయల్ కోర్టు సమీక్షించింది.
కాగా ఈ ఏడాది మే 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వచ్చిన రొమేనియా మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టగా.. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.
మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా.. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. నిందితుల్లో రాజకీయ, ఉన్నత వర్గాలకు చెందిన వారి కుమారులున్నారు. ఈ కేసులో నిందితులకు జువెనైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణిస్తే.. వారికి సైతం శిక్షలు పడే అవకాశం ఉంటుందని పోలీసులు విచారణ సమయంలో తెలిపారు.
నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మైనర్లు అయినప్పటికీ.. నేరం మాత్రం ఆ స్థాయిది కానందున మైనర్లుగా పరిగణించి, శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే కోర్టు నలుగురు నిందితులను మేజర్లుగా గుర్తించింది.నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని నిర్ధరించింది. ఎమ్మెల్యే కుమారుడిని జువైనల్‌గా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది.