Hyderabad, July 10: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి (Khammam to Devarapalli) కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి (Greenfield Express Higway) హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది.
సుమారు 158 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని పూర్తిచేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే. తెలంగాణ నుంచి కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులకు సరకు రవాణాకూ ఈ మార్గం ఉపకరిస్తుంది. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ రహదారి అందుబాటులో ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఫోర్ లేన్ విస్తరణ పనులు సాగుతున్నాయి.
అయితే ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు రహదారిని 4 వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అక్కడి నుంచి విశాఖ వరకు ఇప్పటికే 4 వరుసల మార్గం ఉంది. ప్రణాళిక మేరకు పనులన్నీ పూర్తయితే హైదరాబాద్ నుంచి దేవరాపల్లి మీదుగా విశాఖకు 625 కి.మీ. మార్గం 4 వరుసలుగా విస్తరించినట్లు అవుతుంది. ఖమ్మం నుంచి దేవరాపల్లి మార్గానికి నంబరు కేటాయించటంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.