Hyderabad, May 12: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు పరుస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ రాష్ట్రం కూడా చేరిపోయింది. నేటి నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ లాక్డౌన్ ఉదయం 10 నుండి ప్రారంభమవుతుంది. ఇది మే 21 వరకు పది రోజులు కొనసాగుతుంది. షాపులు మరియు ఇతర వ్యాపార కార్యకలాపాలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే తెరవబడతాయి.
ఈ 4 గంటల్లో మాత్రమే ప్రజలు తమకు అవసరమైన పనులు చేసుకునే వీలుంది. ఆ తర్వాత కఠిన లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఎవరూ కూడా బయట తిరగటానికి వీలు లేదు అని ప్రభుత్వం నుండి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. లాక్ డౌన్ మార్గదర్శకాలు
ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి లాక్డౌన్ ను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని డిజిపి మహేంధర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించిన వాటికి మినహా మిగతా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని డిజిపి స్పష్టం చేశారు. వివాహాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి, ఇరువైపులకు సంబంధించి 40 మంది మాత్రమే హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలన్నారు.
During #LockDownInTelangana: citizens must obtain an e-pass for all the inter-district and inter-state trips for travel during #Lockdown period between 1000 hrs to 0600 hrs on any day.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 11, 2021
ఏదైనా అత్యవసర అంతర్-జిల్లా లేదా అంతర్-రాష్ట్ర ప్రయాణాలకు ముందస్తు అనుమతి/e-పాస్ తప్పనిసరి. ఈ e-పాస్ ను సిటిజెన్ సర్వీస్ పోర్టల్ https://policeportal.tspolice.gov.in నుండి సంబంధిత పత్రాలను సమర్పించి పొందాల్సిందిగా సూచించారు.
ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని డిజిపి కోరారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ పొందాలనుకునే వారు తమ మొబైల్ ఫోన్లలో మొదటి డోసుకు సంబంధించిన మెసేజ్‌ను చూపించి టీకా కోసం వెళ్లవచ్చునని తెలిపారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు.