![](https://test1.latestly.com/uploads/images/2025/02/mini-medaram-jatara-2025-here-are-the-details.jpg?width=380&height=214)
Warangal, Feb 12: మేడారం మినీ జాతర ప్రారంభమైంది. నేటి నుండి నాలుగు రోజులపాటు సాగనుంది మినీ జాతర (Mini Medaram Jatara 2025). మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాతరలో సమ్మక్క- సారలమ్మ జాతర ఒకటి (Medaram Jatara). ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క - సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. అమ్మవార్లకు బెల్లాన్ని(బంగారాన్ని) సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.
అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికెడు తీసుకెళ్లినా చాలు.. ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.
మినీ జాతర(Mini Medaram 2025) నేపథ్యంలో ఆర్టీసీ వివిధ డిపోల నుండి 200 బస్సులు నడిపించనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా తొమ్మిది డిపోలు ఉండగా, అవసరాన్ని బట్టి ఆయా డిపోలన్నింటి నుంచి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 ఛార్జీ చేయనున్నారు.
13న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమతో అమ్మవార్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 14న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వీలు కల్పించనున్నారు. 15న అమ్మవార్లకు ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. దీంతో మండ మెలిగే పండుగ ఘట్టం ముగుస్తుంది.