Hyderabad, April 21: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను కూడా రాత్రి 8 గంటలకే మూసివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని మల్టీప్లెక్సులు, థియేటర్లు, సినిమా హాళ్లను (movie theatres) 8 గంటలకే మూసేయాలి. వాటి సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
ప్రవేశద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం పాటించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. థియేటర్లలో 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 40–70 శాతం తేమ, లోపలికి, బయటికి గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేయాలి. ఇంటర్వెల్, ముగింపు సమయంలో ప్రేక్షకులు భారీగా గుమిగూడకుండా చూడాలి.
ఇక రాత్రి కర్ఫ్యూ (TS Night Curfew) విధిస్తూ మంగళవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. సినిమా థియేటర్ల యజమానులు సెకండ్ షోను రద్దు చేసుకున్నారు. మిగతా మూడు షోల సమయాన్ని సవరించారు. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30గంటల వరకు.. మ్యాట్నీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు.. ఫస్ట్ షోను 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటలలోపు ముగించేలా మార్చారు.
అయితే తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా నేటి (బుధవారం) నుంచి రాష్ట్రంలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
ఇక ఆర్టీసీ (TSRTC) బస్సుల సమయాల్లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో సిటీ బస్సులు (City Buses) తిరిగే సమయాన్ని కుదించింది. తెల్లవారుజామున 4 గంటలకే మొదలయ్యే సర్వీసుల సమయాన్ని 6 గంటలకు మార్చింది.
తిరిగి రాత్రి 7 గంటలకల్లా చివరి ట్రిప్పు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించింది. మొత్తంగా రాత్రి 9 కల్లా బస్సులు డిపోలకు చేరనున్నాయి. కొన్ని సిటీ సర్వీసులు నైట్ హాల్ట్ సర్వీసులుగా నడుస్తుండగా ఇకపై అవి రాత్రి 9 గంటలకల్లా చివరి ట్రిప్పు ముగించేలా సమయాన్ని మారుస్తారు.
మరోవైపు జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రాత్రి కర్ఫ్యూ మొదలవక ముందే బయలుదేరి.. కర్ఫ్యూ సమయంలో గమ్యం చేరే బస్సులు బస్టాండ్లలో ప్రయాణికులను దింపాక వారు ఇళ్లకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే ప్రయాణ టికెట్‌ను చూపాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా రాత్రిపూటనే బయలుదేరుతాయి.
ఈ సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. కర్ఫ్యూ ఉన్నా బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రయాణ టికెట్‌ను చూపించి బస్టాండ్లకు చేరుకోవచ్చు. తగినంత మంది ప్రయాణికులు ఉంటేనే బస్సులు రాత్రి వేళ నడుస్తాయని, లేకుంటే రద్దవుతాయని అధికారులు తెలిపారు. దీనిపై ముందుగా సమాచారం ఇస్తామని, టికెట్ డబ్బులను వాపస్ చేస్తామని పేర్కొన్నారు.
రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. కర్ఫ్యూ వేళల్లో స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు టికెట్లు చూపాలి. స్టేషన్ల వద్ద ప్రీపెయిడ్ ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు పోలీసులను కోరారు.