Hyd, Mar 22: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై (No early polls) సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ (TRS) విస్తృతస్థాయి సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులతో పాటు పారిశ్రామిక, ఐటీ పెట్టుబడులు సాధించాల్సి ఉంది. ఏ స్థాయీ లేనివాళ్లు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడితే మాకు సంబంధం లేదు’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (Telangana CM KCR ) స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్సేనని పేర్కొన్నారు. మేం ప్రారంభించిన పథకాలు, పనులు పూర్తి చేసేందుకే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే తెలివైన నిర్ణయం తీసుకున్నాం. 88 సీట్లతో అధికారంలోకి వచ్చాం. ఇప్పుడా అవసరం లేదని అన్నారు.
2023 ఎన్నికల తర్వాత తాను రాష్ట్రంలో ఉంటానా.. జాతీయ రాజకీయాల్లోకి వెళతానా అన్నదానిని సమయం నిర్ణయిస్తుందన్నారు. ఎక్కడ అవసరముంటే అక్కడికి వెళ్తానని.. తాను జాతీయ రాజకీయాల్లో అద్భుత పాత్ర పోషిస్తాననేది మాత్రం ఖాయమని వ్యాఖ్యానించారు. చినజీయర్ స్వామితో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ పార్టీయే. 2014లో 63 సీట్లతో, 2018లో 88 సీట్లతో అధికారంలోకి సాధించిన మేం.. ఈసారి 95 నుంచి 105 స్థానాలు సాధిస్తాం. 25 రోజుల్లో మేమిచ్చే నివేదికతో అంతా ఆశ్చర్యపోతారు. తాజాగా మూడు వేర్వేరు సంస్థలతో 30 స్థానాల్లో నిర్వహించిన సర్వేలో 29 చోట్ల మాకు అనుకూల ఫలితం వచ్చింది. మిగతా ఒకచోట కూడా ఓట్ల తేడా 0.3శాతం మాత్రమేనని చెప్పారు.
ఏ రంగం చూసినా ఈ దేశంలో తిరోగమనమే. అభి వృద్ధి లేదు, జీడీపీ పెంచేదిలేదు. ఆకలిచావులు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. యువత నిరుద్యోగ ఇండెక్స్‌లో లాస్ట్ ర్యాంకులో ఉన్నాం. సిరియా కంటే అధ్వానంగా ఉన్నాం. గతంలోని యూపీఏ, ఇప్పటి మోదీ ప్రభుత్వాల విధానాలే కారణం. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇంతకంటే ఏమీ చేయలేమని చెప్పింది. అందుకే ప్రగతిశీల విధానం లో పనిచేసే ప్రభుత్వం రావాలి. జాతీయ రాజకీయాల్లోని ఈ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీకో, మరో పార్టీకో వ్యతిరేకంగా అని కాకుండా.. దేశ ప్రజల మేలు కోరే ఫ్రంట్ రావాలి. 50 ఏళ్ల రాజకీ య అనుభవంతో చెప్తున్నా.. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయం వస్తుంది. 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం పయనిస్తుంది.
జాతీయస్థాయిలో ఏర్పాటయ్యేది వేదికా, ఫ్రంటా అన్న విషయంపై స్పష్టత లేదు. చర్చలు సాగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో బీజేపీయేతర సీఎంల సమావేశానికి కొంత సమయం పడుతుంది. ఆ సమావేశంలో సీఎంలే కాకుండా బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు కూడా పాల్గొంటారు. ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా చర్చించి 2024లో ప్రజలను కదిలించేందుకు ఏది ఉత్తమమైనదో ఆ ప్రక్రియను అనుసరిస్తామని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే దుర్మార్గ విధానాలను తిప్పికొట్టాలి. దీనిపై ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ధాన్యంపై ఆందోళనలతోనే ఆగిపోబోం. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ధర్నా చేస్తాం. రిజర్వేషన్లు పెంచే అంశంపై కేంద్రాన్ని నిలదీస్తాం. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదు. దీనిపైనా పో రాడుతాం. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేసీఆర్ భయపడడు. ఆ తరహా బెదిరింపులు అన్నిచోట్లా పనిచేయవు. దాడులు చేయాలనుకుంటే స్వాగతం. ఈడీ కాకుంటే బోడీ దాడులు చేయండి.
దేశంలో మార్పు కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నాతో కలిసి పనిచేస్తుంటే బాంబులా భయపడుతున్నారు. సర్వేల ద్వారా ప్రజల నాడి పట్టుకునే కళ ఆయన దగ్గరుంది. ఎనిమిదేళ్లుగా పీకే నాకు మిత్రుడు. కేవలం తెలంగాణ కోసమే కాదు.. దేశ రాజకీయాల్లో నాతో కలిసి పనిచేస్తున్నారు. డబ్బు తీసుకొని పనిచేసేందుకు ఆయన పెయిడ్ వర్కర్ కాదు. దేశంపట్ల నిబద్ధత ఉన్న పీకేను డబ్బులు తీసుకొని
పనిచేస్తాడని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.