Corona in Hyderabad (photo-Youtube grab)

Hyderabad, Aug 20: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కరోనా వైరస్ (Hyderabad Coronavirus) మీద కొన్ని ఆసక్తికర నిజాలు బయటకు వచ్చాయి. ఓ సర్వే ప్రకారం హైదరాబాద్‌ నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని రిపోర్ట్ బయటకు వచ్చింది.సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలాజీ (CCMB) అనే సర్వే సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. కోవిడ్ వచ్చిన వీరిలో చాలామంది ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే కోలుకున్నట్టు తెలిపింది. ఇప్పటికీ 2.6 లక్షల మందిలో కరోనా వైరస్‌ ఉండవచ్చని పేర్కొంది. వైరస్‌ విస్తరణను (SARS-CoV-2) పరిశీలించడానికి సీసీఎంబీ నగరంలో మురుగునీటిపై పరిశోధన చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటివరకు కోవిడ్‌ బారినపడ్డ వారు 46,425 మందిగా ఉన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏడు సీవరేజీ ప్లాంట్లలో మురుగునీటిని సేకరించి పరిశీలించింది. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి మానవ వ్యర్థాలు, నీటి నమూనాలు సేకరించి విశ్లేషించారు. దాదాపు 30 మందితో కూడిన నాలుగు శాస్త్రవేత్తల బృందాలు అంబర్‌పేట, నాగోల్‌, అత్తాపూర్‌, నల్లగండ్ల ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల వద్ద మురుగునీటి నమూనాలను సేకరించాయి. ఈ పరిశోధనలో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (IICT) శాస్త్రవేత్తల సహకారం తీసుకున్నారు. తమ పరిశోధనల ఫలితాలను సీసీఎంబీ బుధవారం వెల్లడించింది. తెలంగాణలో 97 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1724 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో, 729కు పెరిగిన కరోనా మరణాలు

నగర జనాభా ద్వారా విసర్జితమయ్యే మురుగులో 40 శాతం మాత్రమే శుద్ధి కేంద్రాలకు చేరుతోంది కాబట్టి.. మిగిలిన మురుగునూ లెక్కలోకి తీసుకుంటే సుమారు 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉంటుందని అంచనా వేశారు. వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు మురుగునీటి ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని స్పష్టం చేశారు. శుద్ధీకరించే ముందు నీటిలో కరోనా వైరస్‌జన్యు పదార్థపు ఆనవాళ్లు కనిపించగా.. శుద్ధి తరువాత మాత్రం దాదాపు లేకుండా పోయాయని సీసీఎంబీ తెలిపింది.

కరోనా బాధితుల నాసికా ద్రవాలు, నోటిద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతమవుతుంది. మురుగునీటిలో చేరిన వైరస్‌ వల్ల వ్యాధి వ్యాపించదు. కానీ ఈ మహమ్మారి ఎంతమందికి సంక్రమించింది? తీవ్రత ఎలా ఉందనే విషయం తెలుసుకోవచ్చు. కరోనా సోకినవారి విసర్జితాలలో 35 రోజులవరకు వైరస్‌ ఉంటుంది. హైదరాబాద్‌లో రోజుకు 1800 మిలియన్‌ లీటర్ల నీటిని వినియోగిస్తుండగా, 40 శాతం సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు చేరుతుంది.

ఈ ప్లాంట్లలో మురుగునీరు ప్రవేశించే ద్వారాల వద్ద సేకరించిన నమూనాల్లో వైరస్‌ను గుర్తించాం. ప్లాంట్‌లో శుభ్రమై బయటకువచ్చిన నీటిలో వైరస్‌ లేకపోవడాన్ని గమనించాం. దీనివల్ల ఈ ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయని నిర్ధారణకు వచ్చామని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు. దేశంలో కరోనాపై భారీ ఊరట, 21 లక్షలకు చేరువలో డిశ్చార్జ్ కేసుల సంఖ్య, తాజాగా 69,652 కేసులు నమోదు, యాక్టివ్‌గా 6,86,395 కేసులు, 53,866 మంది వైరస్‌‌తో మృతి

మురుగునీటి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా రెండు లక్షలమంది విసర్జితాల్లో వైరస్‌ ఉన్నట్టు అంచనావేశారు. 40% మురికినీరు మాత్రమే చేరుతున్న ఈ కేంద్రాల్లో సేకరించిన నమూనాల్లో 2 లక్షల మందికి వైరస్‌ ఉంటే.. నగరమంతటా సుమారు 6.6 లక్షల మందికి కరోనా సోకి ఉండవచ్చని అంచనావేశారు. వీరంతా గత 35 రోజులలో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని శాస్రవేత్తలు పేర్కొన్నారు. నగరంలో ఆరుశాతం మందికి కరోనా వచ్చిపోయిన విషయం కూడా తెలియకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి ఇంకా సుమారు 2.6 లక్షల మందిలో కరోనా లక్షణాలుండవచ్చని సీసీఎంబీ అంచనావేసింది. ఈ పరిశోధనలను ‘మెడ్‌రెక్సిన్‌' అనే ముందస్తు ప్రచురణలు జరిపే సర్వేలో పొందుపరిచారు.

రోగ లక్షణాలు లేనందున చాలామంది దవాఖాన వరకు రావడం లేదని భావిస్తున్నారు. మన ఆరోగ్య వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని సీసీఎంబీ పేర్కొన్నది. ఈ పరిశోధనలన్నీ సీసీఎంబీ కరోనా పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. లక్షణాల్లేని వారు ఎక్కువగా ఉండటం వల్లే ఆసుపత్రుల్లో రద్దీ సాపేక్షంగా తక్కువగా ఉందని, పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజారోగ్య వ్యవస్థలకు వీలైందని చెప్పారు.

మురుగునీటిపై తాము నిర్వహించిన పరిశోధనను జీహెచ్‌ఎంసీ (GHMC) వంటి పౌరసేవల సంస్థలతో కలిసి నిర్వహిస్తే నగరంలోని హాట్‌స్పాట్స్‌ను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు వాటి పర్యవేక్షణ, ఇన్‌ఫెక్షన్‌ రేటు నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకోవచ్చునని ఆయన వివరించారు. ఐఐసీటీ శాస్త్రవేత్తలు మనుపాటి హేమలత, కొప్పేరి హరిశంకర్, ఎస్‌.వెంకట మోహన్, సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఉదయ్‌కిరణ్, సి.జి.గోకులన్, కుంచ సంతోష్‌కుమార్‌ ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.