Putta Madhu Arrested: పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధు అరెస్ట్, భీమ‌వ‌రంలో అదుపులోకి తీసుకున్న రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మధు
Putta Madhu Arrested (Photo-Facebook)

Hyderabad, May 8: పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధును రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు (Peddapalli zilla parishad chairman Putta Madhu arrested) చేశారు. గ‌త వారం రోజులుగా పుట్ట మ‌ధు అదృశ్య‌మైన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రంలో పుట్ట మ‌ధును అరెస్టు (Putta Madhu Arrested) చేసిన పోలీసులు.. పెద్ద‌ప‌ల్లి జిల్లాకు తీసుకొచ్చారు.

గ‌త వారం రోజులుగా అదృశ్యానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు మ‌ధును ప్ర‌శ్నిస్తున్నారు. గ‌ట్టు వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఇప్ప‌టికే ఒక‌సారి పోలీసులు పుట్ట మ‌ధును విచారించారు. స‌ద‌రు హ‌త్య కేసుకు సంబంధించి గ‌ట్టు వామ‌న్ రావు తండ్రి గ‌ట్టు కిష‌న్ రావు ఇటీవ‌ల ఇచ్చిన మ‌రో ఫిర్యాదుతో మ‌ధును రామ‌గుండం పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.

కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే మధు ‘గాయబ్‌’ అయ్యారు. ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండగా, పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారని వార్తలు వినిపించగా, తాజాగా భీమవరంలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం.

తెలంగాణలో మూడు ప్రమాదకర వేరియంట్లు, బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో ఊపిరాడక 12 మంది మృతి, రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు అమల్లోకి, తాజాగా 5,559 మందికి కరోనా, మే 15 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

వారం రోజులుగా అదృశ్యమవడానికి గల కారణాల గురించి మధును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే మధుపై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు... వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదులోని అంశాలపై మరొకసారి ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. కాగా పెద్దపల్లికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీనును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో దారుణం, నడిరోడ్డుపై హైకోర్ట్ న్యాయవాద దంపతుల హత్య, వాహనాన్ని అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి చంపిన దుండగులు, అధికార పార్టీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాల ఆరోపణ

ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితంగా మెలగడంతోపాటు ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. కాగా పుట్ట మధు అజ్ఞాతంపై శుక్రవారం ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు.

తన భర్తకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశారని శైలజ వివరించారు. తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం చాలా తప్పని, ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి, ఆయన్ను అప్పట్లో కలిశామని పేర్కొన్నారు. తాము టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని, తమను ఈ స్థాయికి తీసుకొచ్చింది సీఎం కేసీఆరేనని ఆమె స్పష్టం చేశారు. పుట్ట మధుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని శైలజ మండిపడ్డారు.