PM Modi insulted Telangana, TRS called for protests across the state (Photo-Twitter)

Hyd, Feb 9: తెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు (PM Modi insulted Telangana) వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఆగ్రహావేశాలు రగిల్చాయి. ముఖ్యంగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మోదీ అంటేనే మండిపడుతోంది. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శనలు (TRS called for protests across the state) నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

రాష్ట్రంలోని పలు పట్టణాల్లో నల్ల జెండాలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణపై మోదీ (Prime Minister Narendra Modi) విషం చిమ్ముతున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు మోదీ వ్యతిరేక నినాదాలతో మార్మోగిపోయాయి. కాగా ఎంతో హడావుడిగా తెలంగాణ ఏర్పాటు బిల్లును చర్చించకుండానే ఆమోదింపజేశారని ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ను విమర్శించిన సంగతి విదితమే.

నారాయణపేట నియోజకవర్గంలో జాతీయ రహదారిపై మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నల్లజెండాలు చేతబూని, నల్లకండువాలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందినవారు కూడా స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సైతం నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఇది ఏపీకి అత్యంత చెత్త బడ్జెట్, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అటు, ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీ తెలంగాణపై అసందర్భోచితంగా వ్యాఖ్యలు చేశారని, తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్న ఆ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవిత, రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు. ఎంపీలు కేకే, కవిత, రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేతకానితో కలిసి ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌ 17 ఏండ్లపాటు పోరాడి తెలంగాణ సాధించారని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారు చెప్పారు.

జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి శవ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వర్గ రథంలో మోదీ శవయాత్రను చేపట్టారు. పుర వీధుల్లో తిరుగుతూ మోదీకి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్య‌స‌భ‌లో నిన్న ప్ర‌ధాని చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ట్విట్ట‌ర్లో టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. ModiEnemyOfTelangana పేరుతో ట్విట్ట‌ర్‌లో హ్యాష్‌టాగ్‌లు పెడుతున్నారు. గంట‌లోపే 25 వేల‌కు పైగా ట్వీట్ల‌ను టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌లో టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారుల ట్వీట్లు మొద‌టి స్థానంలో ఉన్నాయి.

తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ ప్రగతిని కోరాల్సిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.

తెలంగాణ కోసం ఎంతో మంది బ‌లిదానాలు చేశారు. రాజ్యసభలో ప్రధాని మోదీ తెలంగాణ అమ‌ర‌వీరులు బ‌లిదానాల‌ను అప‌హాస్యం చేశారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరోపించారు. భేష‌ర‌తుగా తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ కుట్రలను తెలంగాణ స‌మాజం తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ‌కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ‌లో మోదీ అండ్ కంపెనీ ఆట‌లు సాగ‌వన్నారు. క‌ర్నాట‌క‌లో మ‌త విద్వేషాల‌కు బీజేపీయే కార‌ణం అని మండిపడ్డారు.

వందేండ్ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు, పార్లమెంట్‌లో ఏకి పారేసిన ప్రధాని మోదీ, లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ఉభయ సభలు

రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ, బీజేపీ నిజస్వరూపం బయటపడింది.తెలంగాణ పై కక్షసాధింపుగా మోదీ వ్యవహరిస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు పోటెత్తాయి. నిన్న పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తక్షణం తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ‌ల మంత్రి హ‌రీశ్‌రావు త‌ప్పుబ‌ట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేక‌పోయినా వ్య‌వ‌సాయ బిల్లుల‌ను ఆమోదించుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు, బీజేపీ మిత్ర ప‌క్షాలు వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకించాయి. అయిన‌ప్ప‌టికీ మూజువాణి ఓటుతో ఆ బిల్లులు పాస్ అయిన‌ట్టు రాజ్యస‌భ‌లో ప్ర‌క‌టించుకోవ‌డం స‌క్ర‌మ‌మా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇదెక్క‌డి రాజ్యాంగ విధానం మోదీ? అని నిల‌దీశారు.

ప్రధాని మోదీకి తెలంగాణ అభివృద్ధిపై ఈర్ష్య, ద్వేషం, అసూయ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసనగా.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి, అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరుగనపడేసి.. దేశాన్ని మోనార్క్‌లా ఏలాలని మోదీ అనుకుంటున్నాడని మంత్రి విమర్శించారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణపై ఎంత కక్ష ఉన్నదో పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. పార్లమెంటులో ఏ ఎంపీ ప్రశ్నించకపోయినప్పటికీ, ఆంధప్రదేశ్‌ విభజన అంశాన్ని లేవనెత్తిన ప్రధాని పొలిటికల్‌ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రధాని మోదీ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండటాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ దిగజారి మాట్లాడుతున్నరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలను బీజేపీ అవమానించిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ తీవ్రంగా స్పందించారు. తక్షణమే తెలంగాణ సమాజానికి మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. బీజేపీ అగ్రనేతలను మేనేజ్‌ చేసి మోదీ పదవులు పొందారని ఆరోపించారు. పార్లమెంటు ప్రాసెస్‌ తెలియని వ్యక్తి మనకు ప్రధానిగా ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణ ను అవమాన పరుచడంపై సీపీఐ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో నల్లగొండలో సుభాష్ విగ్రహం వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.