
Hyderabad, Feb 21: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం (Ramadan Month) సందర్భంగా కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతిస్తూ (Shops Open In 24 Hours In Ramadan Month) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా న్యాయాధికారులు, ఇతర విభాగాల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. అలాగే 24 గంటలూ షాపులు ఓపెన్ చేయాలనుకునే యాజమానులు సంబంధిత అధికారుల దగ్గర రశీదులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఈ క్రమంలో సిబ్బందికి సెలవులు, అదనపు పనిగంటలు, అదనపు వేతనం, మహిళా ఉద్యోగులు తదితర విషయాలపై కార్మిక శాఖ కీలక సూచనలు చేసింది.
కీలక సూచనలు
నిబంధనల ప్రకారం సిబ్బందికి సెలవులు, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని కార్మిక శాఖ అధికారులు స్పష్టంచేశారు. రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి వర్కర్లు పనిచేస్తే సాధారణ వేతనాల కంటే రెట్టింపు వేతనాలు ఇవ్వాలని కార్మిక శాఖ కోరింది. సెలవు రోజుల్లో పనిచేసే ఉద్యోగులకు మరొక రోజు సెలవు ఇవ్వాలని తెలిపింది. ఒక్క ఆదివారం మినహా ఏ రోజు కూడా పని వేళలు 13 గంటలకు మించకూడదని పేర్కొంది. మహిళా ఉద్యోగులుంటే షరతులతో కూడిన నైట్ డ్యూటీలు వేయాలని తెలిపింది. మహిళా ఉద్యోగులు రాత్రి వేళల్లో పని చేసేందుకు జీవో 476ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.