
Hyd, Oct 16: తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. వాదనలు వినిన తరువాత హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, ఈ దశలో పిటిషన్‌ను స్వీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, హైకోర్టు స్వయంగా విచారణ కొనసాగించవచ్చని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అతి శాస్త్రీయంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా డేటా సేకరించి రిజర్వేషన్లు నిర్ణయించారని వివరించారు. ఈ విధానం సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేస్ లో ప్రతిపాదించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ కు అనుగుణంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే నిర్వహించి, బీసీ జనాభా డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచిందని పేర్కొన్నారు.
ప్రతివాది మాధవరెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి పైగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం చాలా సందర్భాల్లో స్పష్టం చేసిందని కోర్టుకు గుర్తు చేశారు. షెడ్యూల్డ్ ఏరియా, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం మించవచ్చని సుప్రీంకోర్టు పూర్వపు తీర్పులను గుర్తుచేశారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్డ్ ఏరియాలు లేవని, అందుకే 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేయలేరని తెలిపారు.
వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం.. హైకోర్టు విచారణను కొనసాగించనివ్వాలని, మెరిట్ ప్రకారం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని, కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళవచ్చని సూచించింది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పై తన ప్రయత్నంలో నిరాశ చెందిందని చెప్పవచ్చు.కాగా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించింది. మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించింది.