Hyd, Nov 3: రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం పీర్జాగూడ ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బస్సు మీద బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్‌కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్ ఒరిగిపోవడంతో కంకర లోడ్ మొత్తం బస్సులోకి పడిపోయింది.
ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సిటీ నుంచి వెళ్లినవాళ్లు తిరుగు పయనమైనట్లు స్పష్టమవుతోంది. అందులో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 20 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి, 8 మంది పురుషులు(ఇద్దరు డ్రైవర్లుసహా) ఉన్నారు. మృతుల్లో పది నెలల పసికందు, ఆమె తల్లి కూడా ఉండడం కలిచివేస్తోంది. కేబిన్‌లలో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 15 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. కంకరను పూర్తిగా తొలగించేందుకే జేసీబీ సహాయం తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 19 మందిలో 13 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించాం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.2 లక్షలు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.