Telangana: తెలంగాణలో ప్రతిరోజూ పాజిటివ్ కేసులు నమోదు, 20 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన, ఆదివారం సమావేశం కానున్న రాష్ట్ర కేబినేట్
Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, April 17:  తెలంగాణలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు మార్చి 02న నమోదు కాగా, నెల తిరగకుండానే పాజిటివ్ కేసుల (COVID-19 in Telangana) సంఖ్య వందల్లో పెరిగిపోయాయి. నేడు ఏప్రిల్ 17 శుక్రవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 700కు చేరింది. గత నెల మార్చి మధ్యస్తం నుంచే కేసుల తీవ్రత పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కారణం రాష్ట్రం నుంచి కొంతమంది దిల్లీలోని మర్కజ్ (Tablighi Jamaat) సమ్మేళనానికి వెళ్లి వచ్చి వారితో పాటు కరోనావైరస్ ను వెంటబెట్టుకొచ్చారు. వారి కారణంగా కేసులు అనేకంగా పెరిగాయి, లేకుంటే రాష్ట్రంలో పరిస్థితి వేరేలా ఉండేదని ప్రభుత్వ వర్గాలు పదేపదే చెబుతున్నాయి.

నేడు రాష్ట్రంలో నమోదైన 700 కేసుల్లో 645 కేసులు మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో లింక్ ఉన్నవేనని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ పేర్కొన్నారు. ఇప్పటికీ మర్కజ్ వెళ్లి వచ్చిన కొంత మంది పరీక్షలు చేసుకోకుండా అజ్ఞాతంలోనే ఉన్నారని పేర్కొన్నారు. వారు బాధ్యతగా వ్యవహరించి వైద్య పరీక్షలు చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఈటల విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ లో మర్కజ్ వెళ్లి వచ్చిన 6 మంది ద్వారా 81 మందికి కరోనా సోకింది. సూర్యాపేటలో గురువారం ఒక్కరోజే 16 కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఇక కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో చాలా మంది కూడా వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. బుధవారం కేవలం 6 కేసులే నమోదయ్యాయని ప్రభుత్వం కొంత ఊపిరి పీల్చుకోగా మళ్లీ గురువారం కొత్తగా 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కోవిడ్-19 వ్యాప్తి భయాందోళనల నడుమ సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడగించారు. అయితే దీని తదనంతరం ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ను మే 03 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకోగా ఏప్రిల్ 20 నుంచి కొన్ని నిబంధనల్లో సడలింపులు, కొన్ని రంగాలకు మినహాయింపులు ఉంటాయని ప్రకటించారు.  ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు ఆంక్షల సడలింపు, కేంద్రం ప్రకటించిన జాబితా కోసం చూడండి

తాజా పరిణామాల నేపథ్యంలో ఈనెల 19న మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం (Cabinet Meet)  కానుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ ను మే 3 వరకు యధావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశంపై చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది.