Representational Image (Photo Credits: IANS)

New Delhi, April 15: ప్రస్తుతం అమలులో ఉన్న దేశవ్యాప్త లాక్డౌన్ ను మే 03వ తేదీ వరకు పొడగించిన నేపథ్యంలో లాక్డౌన్ యొక్క రెండవ దశకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. మే 03 వరకు రైలు, బస్సు, విమానం సహా అన్ని రకాల ప్రయాణ సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అయితే COVID-19 హాట్‌స్పాట్‌లు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు కేంద్రం లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు చేసింది.  వ్యవసాయం సంబంధిత కార్యకలాపాల కోసం లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపునిచ్చింది.

మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్‌ను 03వ తేదీ వరకు పొడగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ  ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితి తీవ్రతను బట్టి కొన్ని చోట్ల, కొన్ని రంగాలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే.  ఈమేరకు కేంద్ర హోంశాఖ సమగ్ర జాబితాను విడుదల చేసింది.

Lockdown 2.0: What Remains Open, Shut, Allowed, Disallowed? See MHA List

వేటికి అనుమతి ఉంటుంది, వేటికి ఉండవు? ఏవి తెరుచుకోబడతాయి, ఏవి మూసివేయబడతాయి? అనే అంశాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

  • రోజువారీ కూలీలు , ఉపాధి హామీ పనులు వ్యవసాయ సంబంధింత పనుల కోసం వ్యక్తులకు అనుమతించబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పరిశ్రమలకు కఠినమైన సామాజిక దూరం పాటించే నిబంధనలతో అనుమతించబడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఆహార శుద్ధి పరిశ్రమలు, రోడ్ల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు, భవనాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాజెక్టులు, వలస కూలీలకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే వ్యవసాయ, ఉద్యానవన పరిశ్రమలకు అనుమతి ఉంటుంది.
  • పాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ మరియు పశువుల పెంపకం, టీ, కాఫీ మరియు రబ్బరు తోటల సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది.
  • అంతర్-రాష్ట్ర సరుకు రవాణా అనుమతించబడుతుంది. అయితే అత్యవసరమైన వైద్య సేవలు మినహా, వ్యక్తులకు సరిహద్దు దాటేందుకు అనుమతి ఉండదు. హైవేల పక్కన దాబాలు, రోడ్ల పక్కన ట్రక్ రిపేర్ షాపులకు అనుమతి ఉంటుంది.
  • ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగపడే కాల్ సెంటర్లు, ఔషధాలు మరియు వైద్య పరికరాల తయారీ యూనిట్లు ఏప్రిల్ 20 నుండి తిరిగి తెరవబడతాయి.
  • బొగ్గు, ఖనిజ మరియు చమురు ఉత్పత్తికి అనుమతి ఉంటుంది.
  • కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక సంస్థల యొక్క ముఖ్యమైన కార్యాలయాలు అవసరమైనమేరకు తెరిచి ఉంటాయి.
  • బ్యాంకులు, ఎటిఎంలు, క్యాపిటల్ మరియు లోన్ మార్కెట్లు సెబీ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తాయి.

* అన్ని రకాల ప్రయాణాలకు సంబంధించి విమాన, రైలు మరియు బస్సు సర్వీసులు, విద్యా సంస్థలు; పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలు, హోటళ్ళు, సినిమా హాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్, థియేటర్లు మూసివేయబడతాయి. సామాజిక, రాజకీయ మరియు ఇతర కార్యక్రమాలు, మత ప్రార్థనలు, సభలు సమావేశాలు అనుమతించబడవు.  ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు

అయితే కరోనావైరస్ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. ఇక్కడ అత్యవసరాలు, నిత్యావసరల సేవలు మినహా మిగతా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదు. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా విడుదల చేయనుంది.