Hyd, Feb 12: తెలంగాణలో మళ్లీ కుల గణన సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. గత సర్వే (Telangana Caste Survey) సమయంలో పలువురు ఉద్దేశ పూర్వకంగా వివరాలు వెల్లడించలేదన్నారు.
‘తెలంగాణ మరోసారి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఉంటుంది. తొలిసారి చేపట్టిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఈ నెల 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నాం. సర్వేలో పాల్గొనే వాళ్ళు టోల్ ఫ్రీ, మండల కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చని తెలిపారు.
కేసీఆర్ (kcr), కేటీఆర్ లాంటి వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నాం. రాష్ట్ర జనాభాలో వీళ్ళు చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి మొదటి వారంలో కేబినెట్ ఆమోదం తెలుపుతాం. ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. రాబోయే అసెంబ్లీలో బిల్లు పెట్టి.. చట్టం చేస్తామన్నారు. కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో బీసీల శాతం స్వల్పంగా తగ్గినట్లు నివేదిక స్ఫష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో 51 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరిపిన సర్వేలో బీసీల శాతం దాదాపు 5 శాతానికిపైగా తగ్గడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కులగణన సర్వే మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.