CM KCR (Photo-ANI)

Hyd, Dec 1: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నెల 4వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నున్నది. ఈ మేర‌కు తెలంగాణ సీఎంవో ప్ర‌క‌ట‌న జారీ చేసింది. తెలంగాణ మూడో శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఓట్ల లెక్కింపు డిసెంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు(శుక్రవారం) ప్రగతిభవన్‌లో కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం.

తెలంగాణలో రీపోలింగ్‌పై ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు, ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేసిన వికాస్ రాజ్

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్‌ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు ప్లాన్‌ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్.. మునుగోడులో అత్యధికంగా 91.51 శాతం.. అత్యల్పంగా యాకుత్‌ పురా లో 39.9 శాతం పోలింగ్

అలాగే, ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ పేర్కొంది. ప్రతీ టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్.. కౌంటింగ్ సూపర్ వైజర్.. ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక, ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై 2,400 కేసులు అయినట్టు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది.