CM Review on Irrigation System: నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.. ఆర్డీఎస్ పథకంలో తెలంగాణ హక్కు కోసం స్వయంగా కర్ణాటక వెళ్తా! రాష్ట్రంలో నీటి నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష
Telangana CM KCR | File Photo.

Hyderabad, March 25: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ పంట పొలాలకు నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున, సాగునీటి వ్యవస్థలను పటిష్టపరుచుకోవాలని, ఇందుకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ - అమలు మరియు నిర్వహణ) వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత పెరిగిందన్నారు. బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ దాకా, నదుల నుంచి చివరి ఆయకట్టు దాకా నీటిని తీసుకెళ్లే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు తదితర అన్నిరకాల నిర్మాణాలను వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మరమత్తుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సీఎం తెలిపారు.

పాలమూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, నిర్మాణాలు విస్తరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మూడో సారి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘సాగునీరు, తాగునీరు ఏదైనా కానీ నేడు తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్ లైన్ గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కాల్వల వ్యవహారం అంతా ఆంధ్రా రాష్ట్ర వ్యవహారం అన్నట్టుగా సాగింది. కానీ నేడు తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ యాసంగిలోనే తెలంగాణ 52 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తూ, వరిపంటలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. మనకు పంటలే పండవు అని మనలను తక్కువ చేసి చూసిన పక్క రాష్ట్రం ఇవ్వాల మూడోస్థానంలో ఉన్నది. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సాగునీటి రంగం ఎంత వైబ్రంట్ గా వున్నదో. ఇంత విస్త్రృతమైన నెట్వర్క్ గతంలో లేకుండె. ఉమ్మడి రాష్ట్రంలో మన ఇంజనీర్లకు అంతగా అవగాహన కల్పించలేదు, కానీ ఇప్పుడు ఆ అవసరం పెరిగింది. ప్రతి కింది స్థాయి ఇంజనీరుకు కూడా ఇరిగేషన్ వ్యవస్థమీద మరింతగా కమాండింగ్ రావాల్సిన అవసరమున్నది.’’ అని సీఎం అన్నారు. ఓ అండ్ ఎం కు ప్రత్యేక అధికారులను నియమించుకోవాలి. ప్రతి సాగునీటి కాల్వ సర్కారు తుమ్మలు చెత్తా చెదారం లేకుండా అద్దంలా మెరువాలె అని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణకు వ్యవసాయమే మొదటి ప్రాధాన్యతారంగం. నేడు కాళేశ్వరం పూర్తిస్థాయిలో నీరందిస్తున్నదనీ, త్వరలో పాలమూరు, కల్వకుర్తి, జూరాల పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నవన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రిజర్వాయర్లు సాగునీటి కాల్వలతో విస్తరించనున్నది. తెలంగాణ సముద్రమట్టానికి అత్యంత ఎత్తున ఉన్నందున సాగునీటి కోసం పంపులతో ఎత్తిపోసుకోవడం అనివార్యం అయింది. ఈ పరిస్థితుల్లో నీటి వ్యవస్థ నిర్వహణ రానున్న రోజుల్లో మరింతగా పెరగనున్నదని సీఎం పేర్కొన్నారు.

పాలమూరు ఎత్తిపోతలను కల్వకుర్తి జూరాలకు అనుసంధానం చేసే కార్యాచరణకు సంబంధించి సీఎం చాలాసేపు కసరత్తు జరిపారు.

అలాగే, గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 88 వేల ఎకరాలకు సాగునీరందించే ఆర్డీఎస్ స్కీం పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ లో కేటాయించిన ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టిఎంసీల నీటిని సాధించుకుంటామన్నారు. అందుకు కావాల్సి వస్తే తాను కర్నాటక ప్రభుత్వంతో స్వయంగా వెళ్లి చర్చించి వస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.