CM KCR Warangal Tour: వరంగల్‌ అర్బన్‌‌కు హన్మకొండ జిల్లా, వరంగల్‌ రూరల్‌కు వరంగల్‌ జిల్లాగా పేర్లు మార్చిన సీఎం కేసీఆర్, రెండు, మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు, వరంగల్‌లో కరువు మాయం కావాలని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Telangana CM KCR | File Photo

Warangal, June 21: వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. జిల్లాల కొత్తపేర్లపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. వరంగల్‌, హన్మకొండలో వేర్వేరు కలెక్టరేట్లు నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై హన్మకొండ (Warangal Urban As Hanamkonda District), వరంగల్‌ జిల్లాలని కేసీఆర్ పేర్కొన్నారు.

కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లాకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌తో వరంగల్ పోటీ పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అనే పదంపై ముఖ్యమంత్రి (Telangana CM KCR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ అనే పేరు కూడా మారిస్తే బాగుంటుందన్నారు. బ్రిటీష్‌ కాలంలో పెట్టిన పేరు కలెక్టర్ అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నిన్ననే వరంగల్‌ జిల్లాలకు వెటర్నరీ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ సమస్యలు తీరాయన్నారు. పారదర్శకత పెరిగితే పైరవీలు ఉండవన్నారు. వరంగల్‌ విద్యా, వైద్య, పరిశ్రమల కేంద్రం కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి పాత తాలుకాలో మాతాశిశు సెంటర్లు రావాలని, వరంగల్‌కు డెంటల్‌ కాలేజీతోపాటు ఆస్పత్రి మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.

వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, పలు అభివృృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి

వైద్యరంగం మీద దాడులు సరికావు. చైనాలో 28 గంటల్లో 10 అతస్తుల భవనం కట్టారు. ఏడాదిన్నరలో ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలి. ప్రపంచంలోనే వైద్య సేవలు కెనడాలో బాగున్నాయని అంటారు. కరోనాపై దుష్ప్రచారం సరికాదు. కెనడా వైద్య విధానంపై ఆధ్యయనానికి ఒక బృందాన్ని అక్కడికి పంపించి, కెనడాను మించిన వైద్య విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని కేసీఆర్‌ అన్నారు,

నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా వస్తే టెంపరేచర్‌ పెరుగుతుంది. పారాసిటమాల్‌ వేసుకోమని డాక్టర్‌ చెప్పారు. నాకు కరోనా వచ్చినప్పుడు కేవలం పారాసిటమాల్‌ మాత్రమే వేసుకున్నా. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దు.

జైలు కూల్చతే నాకేమైనా వచ్చేది ఉందా. అయినా కూడా కొందరు విమర్శించారు. ఆశా వర్కర్లు ఇంటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేశారు. వాళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. వరంగల్‌లో కరువు మాయం కావాలి. దేవాదుల ప్రాజెక్టు వరంగల్‌ జిల్లాకే అంకితం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ కోసం పరితపించారు. 50 ఏళ్లు పోరాటం చేశారు. జులై 1-10 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు

వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. హన్మకొండలో రూ.57 కోట్లతో 3 అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని హంగులు ఉన్న కలెక్టరేట్‌ నిర్మించినందుకు అభినందనలు తెలిపారు. వరంగల్‌ వైభవం చాటిచెప్పేలా కలెక్టరేట్‌ నిర్మించారని కితాబిచ్చారు.

తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాలని కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌ నగరంలో దంతవైద్యశాల, దంతవైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుందని అన్నారు. ఇతర జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని చెప్పారు.

ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకం. ప్రజలు తమ పనుల కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్‌లు కూడా త్వరగా పూర్తి కావాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. కలెక్టర్‌ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్‌ అనేవారని, ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లేదని అందువల్ల వారి పేరు మారిస్తే బాగుంటుందని అన్నారు.

జులై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థలకు జులై నిధులు ముందే విడుదల చేస్తామని చెప్పారు. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రిని కూడా పడగొట్టి కొత్త ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతపడినాయని, కొత్త భవనాలను నిర్మించి ఎంజీఎంని అత్యాధునికంగా మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తామని చెప్పారు. ఎంజీఎం కొత్త ఆస్పత్రి నిర్మాణానికి రూ. 2, 3 వేల కోట్లు ఖర్చయినా ఫర్వాలేదన్నారు.

లాక్‌డౌన్‌ మరిన్ని ఎక్కువ రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తేశామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సడలింపులు ఇచ్చినా కేసుల వ్యాప్తి పెరగలేదన్నారు.