Tejaswi Yadav Meets CM KCR (Photo-Twitter.CMO Telangana)

Amaravati, Jan 12: జాతీయ రాజకీయాలపై అసక్తి చూపుతున్న కేసీఆర్‌ బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి మంగళవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ (Tejaswi Yadav Meets CM KCR) అయ్యారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్జేడీ నేత, బిహార్‌ విపక్ష నేత తేజస్వియాదవ్‌లు (RJD's Tejashwi Yadav) విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు రైతులు సహా సమస్త వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న BJP ని కేంద్రంలో గద్దె దించేంతవరకు పోరాడాల్సిన అవసరముందన్నారు.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ (K Chandrasekhar Rao) నెల వ్యవధిలోనే నాలుగు పార్టీల నేతలతో మంతనాలు జరిపారు. డిసెంబరు 14న ఆయన చైన్నెలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిశారు. శనివారం సీపీఎం, సీపీఐ జాతీయ నేతలతో వేర్వేరుగా ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. తాజాగా రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) బృందాన్ని కలిశారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు వారికి స్వాగతం పలికి సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేయాలని, ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఏకం కావాలని కేసీఆర్‌, తేజస్వియాదవ్‌ల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. అందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణను త్వరలో రూపొందించుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

కేసీఆర్‌, తేజస్విల మధ్య రెండు గంటల పాటు జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. బీజేపీను ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమని పేర్కొంటూ దీని రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించడంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకొనేందుకు ఒక్క మంచి పని కూడా చేయలేదని కేసీఆర్‌, తేజస్వి అభిప్రాయపడినట్టు సమాచారం.

తెలంగాణను ముంచెత్తిన అకాల వర్షాలు, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ, ఆరు జిల్లాలో బీభత్సం సృష్టించిన వరుణుడు

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉందని, దేశంలో ఏ ఒక్క రంగంలోనూ పురోగతి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ''ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజా సంక్షేమాన్ని మాని... వారికి పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వరంగ సంస్థలను అడ్డగోలుగా విక్రయిస్తోంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపుతోంది. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలపై నిర్దయగా వ్యవహరిస్తోంది.

వివాదాస్పద వ్యవసాయ చట్టాలతో అణిచివేతకు పూనుకుంది. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో వ్యతిరేకత ఖాయమని భావించి, ఆ చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. మళ్లీ వాటిని అడ్డదారిలో తెచ్చేందుకు పథకం వేస్తోంది. తెలంగాణలో రైతు పండించిన ధాన్యం సేకరణపై చేతులెత్తేసింది. దేశంలోని చట్టబద్ధ సంస్థలను రాజకీయ పబ్బం కోసం దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ పై దేశవ్యాప్తంగా ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో BJPకు ఎదురుదెబ్బ ఖాయం. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి సంఖ్యాబలం పరంగా పెద్ద రాష్ట్రాలు ఎంతో కీలకం. యూపీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీని కట్టడి చేయగలిగితే ఆ పార్టీకి అధికారం దక్కడం కల్ల.

విపక్ష పార్టీలన్నీ ఏక తాటిపై నడవడం అత్యవసరం. దీనికి సమగ్ర కార్యాచరణ కావాలి. ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యత దిశగా పయనిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు ఓటమి తప్పదు'' అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి కేసీఆర్‌.. తేజస్వికి తెలియజేశారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలపై తేజస్వి ఆసక్తి చూపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తాజా పరిణామాలపై ఈ సందర్భంగా కేసీఆర్‌, తేజస్వి చర్చించినట్టు తెలిసింది. యూపీలో బీజేపీ ప్రభుత్వం నుంచి మంత్రితో పాటు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు బయటకొస్తున్నారని, ఆ పార్టీ పతనానికివి నాందిగా వారు విశ్లేషించినట్టు సమాచారం. రానున్న యూపీ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌కే మద్దతిస్తున్నట్టు సీనియర్‌ రాజకీయ నేత శరద్‌ పవార్‌ ప్రకటించడం ఈ దిశగా గొప్ప పరిణామమని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

తేజస్వి తండ్రి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై కేసీఆర్‌ ఆరా తీశారు. ''తెలంగాణ ఏర్పాటుకు మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేడు దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. మీ పాలనానుభవం దేశానికి అవసరం ఉంది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలి. లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. BJP అరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలి'' అని లాలూప్రసాద్‌ యాదవ్‌ కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది.

బిహార్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీకే మెజారిటీ సీట్లు దక్కుతాయని సమావేశంలో తేజస్వి వెల్లడించినట్లు తెలిసింది. బిహార్‌లో క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలపడుతోందని చెప్పారు. ''లౌకికవాద శక్తుల పునరేకీకరణ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మేం సంపూర్ణ మద్దతు ఇస్తాం. కలిసి పనిచేస్తాం'' అని ఈ సందర్భంగా తేజస్వి యాదవ్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ''కేంద్రం అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. దాని విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టాల్సిందే. BJPను కేంద్రంలో గద్దె దించేందుకు జరిగే పోరాటంలో మేమూ భాగమవుతాం'' అని ఆయన చెప్పినట్టు తెలిసింది.