Hyd, Nov 26: జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని అరాచకం చేయాలనుకునే మతోన్మాదులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గట్టి హెచ్చరిక చేశారు. తెలంగాణకు రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడేదిలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష (CM KCR Review on Law and Order) నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్, వరంగల్ ఐజీలు శివశంకర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘవిద్రోహ శక్తుల ఆటలను సాగనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొన్నారు. పిచ్చిపిచ్చి ప్రేలాపనలతో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే నేతల పట్ల ప్రజలు.. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సురక్షిత నగరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన హైదరాబాద్‌ను కల్లోలపరచడానికి జరుగుతున్న కుట్రలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు.
Here's TS CMO Tweets
The CM also urged the people to be alert and cautious against the communal forces. Wanted them, especially the youth, not to fall prey to these elements. Also appealed to the political parties to fight the polls transparently and in the spirit of democracy.
— Telangana CMO (@TelanganaCMO) November 25, 2020
It's our duty to keep the 1.60 Crore population in Hyderabad safe. The Police have to take stern action against those forces fanning the communal tensions irrespective of the party they belong to. Keep strict vigil round the clock and quell the conspiracies: CM
— Telangana CMO (@TelanganaCMO) November 25, 2020
అరాచకశక్తుల కుట్రలపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నదని..శాంతిభద్రతలను కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకొనే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల (GHMC Elections 2020) సందర్భంగా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపులకు దిగుతున్నారు. సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలూ హైదరాబాద్‌లో నడవవని అరాచకశక్తులకు తెలిసింది. దీంతో మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వమని తెలిపారు.
రాష్ట్రంలోని ఏ కరీంనగర్‌లోనో, వరంగల్‌లోనో, ఖమ్మంలోనో, మరోచోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్‌లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఏదోచోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థన మందిరాల దగ్గర ఏదో ఒక వికృతచేష్ట చేయాలని చూస్తున్నారు. అలాచేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్దఎత్తున గొడవలతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది’అని సీఎం కేసీఆర్ చెప్పారు.
ప్రశాంత హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహశక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీనిచ్చారు. హైదరాబాద్‌లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనా జరగకుండా చూస్తామని తెలిపారు.
శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు : సీపీ అంజనీకుమార్ (CP Anjanikumar)
నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. అసత్య ప్రచారాల కారణంగా హైదరాబాద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్ కేసులు పెడతామని సీపీ తెలిపారు.
సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఎలక్షన్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ హైదరాబాద్ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. ఎన్నికల ప్రచారానికి చాలా మంది వస్తున్నారు. నగరంలో ఏదో జరుగబోతోంది అన్న ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం’’ అని హెచ్చరించారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Here's Anjani Kumar Tweet
Hyd city is in election mode. All leaders are working hard to win the hearts and votes of community. Election is the temple of democracy. But during such times there are some evil minds who are working to create communal issues though social media. Don not believe them. Inform us pic.twitter.com/qMGW5itd1O
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) November 26, 2020
గత ఏడేండ్లలో హైదరాబాద్ నగరానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. శాంతి భద్రతలు మంచిగా ఉండటం, నేరాల రేటు తక్కువగా ఉండటం, ఎలాంటి మతకల్లోలాలు లేకపోవడంతోనే బోయింగ్, యాపిల్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. దీంతో కొదరికి నగరం అభివృద్ధి చెందడం ఇష్టంలేదని, అందుకే విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటివారికి నగరంలో చోటులేదని చెప్పారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ప్రచారానికి సంబంధించి ప్రజలు కూడా డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.