Telangana CM KCR | File Photo

Haliya, Feb 10: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ (Haliya nagarjuna sagar) నిర్వహించింది. నల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ త‌ర్వాత హాలియాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో (Telangana CM KCR Speech Highlights) ప్ర‌సంగించారు.ఈ సభలో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ (Telangana Chief Minister KCR) మండిపడ్డారు.

కొందరు కాంగ్రెస్‌ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని, తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సభలో (TRS Public Meeting) సూచించారు.

హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసని.. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరన్నారు. తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్‌ నేతలు కాదా అన్నారు.

ఎదురెండలో కూడా ఇంత మంది నా సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చినందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. నల్గొండలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్‌లు అందరూ ఎంతో బాగా పని చేస్తున్నారు. చెట్లు పెంచుతున్నారు.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

నెల్లికల్లులో 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన, నాగార్జునసాగర్ హాలియాలో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ, ప్రసంగించనున్న సీఎం

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు.. ప్రతి మండల కేంద్రానికి 30 లక్షల రూపాయలు.. ఒక్కో మున్సిపాలిటీకి కోటి రూపాయలు.. మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. రేపే దీనిపై సంతకం చేస్తాను. సీఎం ప్రత్యేక నిధి నుంచి వీటిని ఇస్తాను. అర్హులైన నిరుద్యోగులందరికి త్వరలోనే నిరుద్యోగ భ్రుతి, కొత్త పెన్షన్‌లు, కొత్త రేషన్‌ కార్డులు ఇస్తాం. నెల్లికళ్లు-జింకలపాలేం భూ వివాదాన్ని పరిష్కరిస్తాం. అర్హులందరికి పట్టాలు ఇస్తాం’’ అన్నారు.

నల్గొండ వెనకబడిన జిల్లా. ఎందరు ముఖ్యమంత్రులు మారినా.. జిల్లాలో అభివృద్ధి జరగలేదు. జిల్లా సమస్యలన్ని నా దృష్టిలో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్‌కుమార్‌ అన్నాడు.. ఆనాడు ఒక్క కాంగ్రెస్‌ నేత అయినా మాట్లాడారా? కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారు.

మీరు నాగార్జునసాగర్‌ కమీషన్ల కోసమే కట్టారా? నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య గురించి ఒక్కరైనా మాట్లాడారా? రైతుబంధు, రైతుబీమా వస్తుందన్నందుకు పోరుబాట చేస్తారా? కాంగ్రెస్‌ హయాంలో కనీసం ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదు. విజయడెయిరీ మూసివేస్తే కాంగ్రెస్‌ నేతలు నోరు తెరవలేదు. దేశంలోనే అత్యధిక వడ్లు ఎఫ్‌సీఐకి ఇస్తున్న రాష్ట్రం మనది. కల్యాణలక్ష్మి ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా?’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎవరూ మాట్లాడొద్దు..మరో పదేళ్లు నేనే సీఎం, తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీ ఎవరూ లేరు, టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్, 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

నెల్లికల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి వచ్చాను. వీటితో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశాను. వీటన్నింటికి 2500 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఏడాదిన్నరలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాను. వేదిక మీద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల, గ్రామీణ ప్రాంత నాయకులంతా దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఏడాదిన్నరలోగా అన్ని సాగు నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలి. ఈ హామీలన్నింటిని పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

CM  KCR laying foundation stone for Lift Irrigation Schemes

దామరచర్లలో 35 వేల కోట్లు ఖర్చు చేసి 4వేల మెగావాట్ల ఆల్ట్రామెగా థర్మల్ ‌విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తున్నాం. భవిష్యత్‌లో రాష్ట్రానికి అత్యధిక విద్యుత్‌ ఇక్కడి నుంచే వస్తుంది. రెండేళ్లలో ఇది పూర్తయితే జిల్లా స్వరూపమే మారుతుంది. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని రూ. 2 వేల కోట్లతో కృష్ణశిలలతో అద్భుతంగా ప్రపంచమే నివ్వెరపోయేలా తీర్చిదిద్దుతున్నాం. మంచి చేసే వారిని ప్రజలు ఆదరించాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా 12,765 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చాం. సర్పంచ్‌లు బాగా పనిచేయాలి.. జిల్లా పరిషత్‌లకు నిధులు ఇస్తాం. ప్రతి గ్రామానికి నర్సరీ ఇచ్చాం. పల్లెప్రగతితో శుభ్రత పెరగడంతో అంటురోగాలు పోతున్నాయి. అమెరికా గురించి గొప్పగా మాట్లాడటం కాదు.. మన పల్లెలను వారొచ్చి చూసేలా అభివృద్ధి జరుగుతుంది. ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించాం. రాష్ట్రంలోని 3400 తండాలను, గూడేలను పంచాయతీలుగా చేశాం. గిరిజనులకే వారి గ్రామాలను పాలించుకునేలా అవకాశం కల్పించాం.

CM KCR Specch At haliya

టీఆర్ఎస్‌‌ పార్టీ అంటే ధీరుల పార్టీ.. వెన్నుచూపే పార్టీ కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నల్లగొండకు శాశ్వత ఆయకట్టు ఏర్పాటు చేసి.. సాగునీటికి సమస్య లేకుండా చూస్తాం. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతాను. డిండి ప్రాజెక్ట్‌ పూర్తయితే పాత నల్లగొండలోని 12 నియోజకర్గాలకు సాగు నీరుకు కరువుండదని సీఎం అన్నారు.

నల్లగొండలో ఫ్లోరైడ్‌ భూతం ఒక జనరేషన్‌ని నాశనం చేసింది. ఇక్కడి ఉద్యమ కారులు ఫ్లోరైడ్‌ బాధితుడిని తీసుకెళ్లి అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ ముందు‌ పడుకోబెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ టీఆర్‌ఎస్‌ ఆరేళ్లలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టింది. అప్పటి చంద్రబాబు పంటలు వేసుకోమని చెప్పి.. మధ్యలో నీరు బందు పెట్టాడు. పంటలు ఎండిపోయాయి. అప్పుడు ఈ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. మేం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి.. నీరు ఇప్పించామని అన్నారు.

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ దెబ్బ లక్షా యాభైవేల మంది జీవితాలను పొట్టన పెట్టుకుంది. నేడు మిషన్‌ భగీరథతో ఫ్లోరైడ్‌ భూతాన్ని శాశ్వతంగా తరిమేశాం. నాడు రోజు కరెంటు బాధలు ఉండే. వేల మోటార్లు కాలిపోతుండే. కానీ నేడు భారతదేశంలోనే రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇది నిజం కాదా? మీ కండ్ల ముందు లేదా?  మీ కాలంలో ఏది లేదు. ఎరువులు, విత్తనాలు ఇయ్యలేదు. కల్తీ విత్తనాలు ఇస్తే ఇంట్లో పండుకున్నారు. ఆనాడు కరెంటు లేదు, ఎరువులు లేవు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదన్నారు.

రెవెన్యూ ఆఫీసుకు పోతే దోపిడీ. రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు పోతే దోపిడీ. మీరు, వాళ్లు పంచుకోని తిన్నరు. కండ్లప్పగించి చూసిన్రు. కానీ ప్రజల కోసం ఏం చేయలే. ఈవాళ కేసీఆర్‌ ప్రభుత్వం ఇదే గులాబీ జెండా తెచ్చినటువంటి ధరణితో సమస్యలు దూరం అవుతున్న మాటా నిజం కాదా? కండ్లముందు కనిపించడం లేదా? లంచాల బాధ పోయిందా? లేదా? రిజిస్ట్రేషన్లకు డబ్బులు ఇస్తున్నరా? అని అడిగారు. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కూడా అయిపోయి రైతు గర్వంగా గల్లా ఎగరేసుకుని సంతోషంగా ఇంటికి పోతున్నాడు.

కానీ మీ కాలంలో చెప్పులరిగేలా ఆర్డీవో ఆఫీసుకు, ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాలే. లంచాలు ఇవ్వాలే, దండం పెట్టాలే, దరఖాస్తులు పెట్టాలే, ఇష్టమున్నట్టు భూములు కాజేయాలి. పేదోనికి రక్షణ లేకుండా చేయాలే. అది మీ రాజ్యం. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. దీనికోసమా పొలం బాట పోయేది. వీఆర్వోలకు అప్పగించి ప్రజలను నాశనం చేసినోళ్లు, గ్రామాలను రావణ కాష్టం చేసినోళ్లు, రైతుల భూములు ఇష్టమున్నట్లు లాక్కునోళ్లు, మీ రాజ్యంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఎడుస్తుంటే నోరు మూసుకుని కూర్చున్నోళ్లు మీరు. ఇవాళ పొలం బాట, పొత్తు బాట అంటున్నరు. ఎవరి కోసం ఈ బాట.

తెలంగాణలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. కళ్యాణ లక్ష్మి, కంటి చూపు, కేసీఆర్‌ కిట్‌.. ఆడపిల్ల పుడితే రూ. 13,500, మగ పిల్లాడు పుడితే రూ.12,000 ఇస్తున్నాం. రెవెన్యూలో అవినీతి నిర్మూలనకు, లంచాల బాధ నుంచి విముక్తి చేయడం కోసం ధరణిని తీసుకువచ్చాం. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. గతంలో వీఆర్వోల చేతిలో పెట్టి గ్రామాలను రావణకాష్టం చేసిన వారు మీరు కాదా’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

కుల వృత్తులను ఆదుకున్నాం. దానిలో భాగంగానే గొల్ల, కురమలకు గొర్రెలు అందిస్తున్నాం. ఇప్పటివరకు 7,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడున్నర లక్షల మందికి గొర్రెలు ఇచ్చాం. ఈ మార్చిలో మరో రెండు లక్షల మందికి.. వచ్చే ఏడాది మరో రెండు లక్షల మందికి గొర్రెలు ఇస్తాం. అన్ని కుల వృత్తులను ఆదుకుంటాం. రాబోయే బడ్జెట్‌లో ప్రతి గ్రామంలో ఆధునిక సెలూన్ల కోసం నాయి బ్రాహ్మణులకు లక్ష రూపాయలు ఇస్తాం’’ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్‌లో మొత్తం 2,600 రైతు కేంద్రాలు నిర్మించి ఇచ్చాం. రైతులంతా అక్కడ కూర్చుని మాట్లాడుకుని అన్ని విషయాలు చర్చించుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు మీకు సేవ చేస్తారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ప్రజలు గుర్తించాలి. గతంలో సిద్ది పేటలో నాలుగు మొక్కలు పెడదాం అంటే దొరకలేదు. కానీ నేడు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకర్‌లు అందజేశాం. ప్రతి గ్రామానికి స్మశాన వాటిక, వ్యర్థాల నిర్వహణ కొరకు ప్రత్యేక వార్డు నిర్మించాం’’ అన్నారు.

హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కలిపిన ఘనత కాంగ్రెస్‌దే. తెలంగాణలో కన్నీరు, కష్టాలకు నాటి కాంగ్రెస్‌ నాయకులే కారణం. మేం ప్రాజెక్ట్‌లు మంజూరు చేస్తే.. కమిషన్‌ల కోసం అంటారు. మిషన్‌ భగీరథను కమిషన్‌ భగీరథ అంటున్నారు. మీకు ప్రజలే సమాధానం చెప్తారు’’ అని కేసీఆర్‌ హెచ్చరించారు.

ఇంకా నాలుగు రోజులు పోతే ఇండియాలోనే భూ సమస్యలు, భూ పంచాయతీలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతుందని సీఎం తెలిపారు. ప్రజలందరి సహకారం, దీవెన ఉంటే ఇంకా కూడా కొత్త చట్టం తెచ్చి ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవసరం లేకుండా భూ సమస్యలు లేకుండా చూసే బాధ్యత తనదన్నారు. సమస్యలను ఒక్కొక్కటి, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

నాది అవినీతి రహిత ప్రభుత్వం. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్‌ఎస్‌. కేసీఆర్‌ వట్టి మాటలు చెప్పడు. తెలంగాణను బంగారు తునక చేయాలని కష్టపడుతున్నాం. ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే ఓట్లు ఆడగం అని చెప్పాలంటే ఎంత ధైర్యముండాలి? ఇంతకుముందు ఏ నాయకుడైనా ఇలా చెప్పారా? రాజకీయ గుంటనక్కలను చూసి మోసపోవద్దు' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? ప్రపంచమే అబ్బురపోయేలా ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉంటే..నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించండి. లేదంటే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయండి. నా మాటలు నిజమని నమ్మితే..వేరే పార్టీలకు డిపాజిట్లు రాకుండా గులాబీ జెండా ఎగరేయాలి. కాంగ్రెసోళ్లకు వింత వింత బీమారీలు ఉన్నాయి. గాలి మాటలకు మోసపోవద్దు. మంచి ప్రభుత్వాన్ని కాపాడుకుంటే బాగుపడతామని' సీఎం పేర్కొన్నారు.