CM KCR Emergency Review: తెలంగాణలో వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష, నష్ట నివారణ చర్యలు మరియు కేంద్రాన్ని సహాయం కోరే అంశాలపై చర్చ
Telangana CM KCR - Heavy Rains (Photo Credits: Facebook)

Hyderabad, October 15: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

మున్సిపల్, వ్యవసాయ, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్,  మెహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ ఎంసి కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు సమావేశానికి తీసుకురావాల్సిందిగా సీఎం ఆదేశించారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలు తదితర విషయాలపై సమావేశంలో సమీక్ష జరుపుతారు.

ఇప్పటికే రాష్ట్రంలో వరద బీభత్సంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.  సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన హామి ఇచ్చారు.

ఇక భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో అంతకుముందు రోజు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని ట్రాన్స్ కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావును అడిగి తెలుసుకున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

‘‘చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారు. వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తి కొనసాగించండి’’ అని ముఖ్యమంత్రి సీఎండిని ఆదేశించారు.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వరదల్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. పోళ్ళు వరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి. ఇంకా వానలు, వరదల ఉధృతి తగ్గలేదు. జలమయమయిన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదు. హైదరాబాద్ తో పాటు చాలా పట్టణాల్లో అపార్టుమెంట్లు నీటితో నిండి ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం అనివార్యం అయింది. కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేయడం జరిగింది. పరిస్థితిని బట్టి మళ్లీ సరఫరా చేస్తున్నాం. ఎక్కడి వరకు సిబ్బంది చేరుకోగలుగుతున్నారో అక్కడి వరకు వెళ్లి 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేయడం జరుగుతుంది’’ అని సిఎండి ముఖ్యమంత్రికి వివరించారు.

మరోవైపు, అటు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లిగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఏపీలో భారీ వర్షాలు, వరదలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు మార్గనిర్ధేశనం చేస్తున్నారు.