Hyd, Dec 12: ఢిల్లీలో ఈ నెల 14న భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో (CM KCR to inaugurate BRS office) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, BRS పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయ (BRS office in Delhi) ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారమే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు.
కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా యాగం నిర్వహిస్తుండటంతో ఆయా ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. యాగశాల నిర్మాణం, కార్యాలయంలో చేపట్టాల్సిన మరమ్మతులు, ఇతరత్రా పనులపై ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌తేజతో చర్చించారు. పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నిర్వహించే హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 14న జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు.కార్యాలయం ప్రారంభం అనంతరం వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా కేసీఆర్ పరిశీలిస్తారు.