Hyd, Mar 4: గల్వాన్ అమరవీరులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం (Galwan martyrs) పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో (Telangana CM KCR ) పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ (Hemant Soren) కూడా పాల్గొంటారు.
గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారు. 2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడిన మృతి చెందిన సంగతి విదితమే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా మరో 19 మంది వీరమరణం పొందారు. ఆ అమరులందరికీ తెలంగాణ రాష్ట్రం తరపున కేసీఆర్ ఆర్ఠిక సాయం ప్రకటించారు.
2020 జూన్ 19న ప్రధాన మంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ పరిహారం ప్రకటించారు. కల్నల్ సంతోష్ బాబుకు రూ. 5 కోట్లు మిగతా అమర వీరుల కుటుంబాలుకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గతంలోనే సూర్యపేటలోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లి పరిహారంతో పాటుగా కల్నల్ భార్య సంతోషికి ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించారు. తాజాగా మిగతా సైనికులకు పరిహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. మరణించిన 19 మంది సైనికుల్లో ఇద్దరు జార్ఖండ్‌కు చెందిన వారు, బీహార్ కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు ఉన్నారు. హిమాచల ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.