Hyd, Mar 11: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. గత రెండు రోజుల నుంచి బలహీనంగా (CM KCR Health Update) ఉన్నట్లు సీఎం చెప్పారు. ఎడమ చేయి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు సాధారణ పరీక్షలతో పాటు ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని (CM KCR's health condition stable) ఎంవీ రావు స్పష్టం చేశారు.
కాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎంవో వెల్లడించింది. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుంచి వీక్‌గా ఉన్నారు. ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.
అయితే యాదాద్రిలో నేడు జరుగుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని రెండు రోజుల క్రితమే ఆలయ ఈవో గీత తెలిపారు. కానీ తనకు అస్వస్థత కారణంగా కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.