Hyd, Jan 26: రాష్ట్రాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను చూస్తు ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తేల్చిచెప్పారు. ఈ విషయంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో మాట్లాడాలని భావిస్తున్నట్టు చెప్పారు. 32 ఏళ్ల తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక(BR Ambedkar University) విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మొదటి ముఖ్యమంత్రిగా క్యాంపస్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు కొత్తగా నిర్మించనున్న మూడు భవనాలకు శంఖుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, యూజీసీ(UGC) ముసుగులో వర్సిటీలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్రాల వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని చూడటం సాంస్కృతిక దాడిగా అభివర్ణించారు. ఈ విషయంలో మేధావులందరూ ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రం, రాష్ట్రాల అధికారాల విషయంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ దాని స్ఫూర్తికి విరుద్ధంగా చేసే ప్రయత్నాలపై సమిష్టిగా కోట్లాడుతామని ప్రధానమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కుట్రను మాపై దాడిగానే భావిస్తాం. ఆ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా చేస్తూపోతే చివరకు స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లు కేవలం పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతాయి అన్నారు.
కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాం అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. త్రివిధ దళాల విన్యాసం, పూల వర్షం కురిపించిన హెలికాప్టర్లు, వీడియో ఇదిగో
వర్సిటీ వీసీల నియామకంలో సామాజిక న్యాయం అనే కోణానికి కూడా ప్రాధాన్యతనిచ్చాం. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)కి దాని చరిత్రలో ఏ రోజూ ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్ గా నియమించబడలేదు. ఆ సామాజిక వర్గం నుంచి విద్యావేత్తను వీసీగా నియమించాం అన్నారు.
విశ్వవిద్యాలయాల పునర్నిర్మాణం జరగాలి. మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం..ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరాలు తెప్పించుకుని సానుకూల నిర్ణయం తీసుకుంటారు అన్నారు. అనుభవం కలిగిన అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నాం. వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలన్న ఆలోచన ఉందన స్పష్టం చేశారు సీఎం రేవంత్.