Telangana Finance Minister T Harish Rao- Budget 2021 | (File Photo)

Hyderabad, March 18: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు గురువారం ఉదయం 11.30 గంటలకు శాసన సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రూ. 2 లక్షల 30 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై ప్రశ్నోత్తరాలు మరియు సాధారణ చర్చ మార్చి 20 నుంచి 23 తేదీలలో షెడ్యూల్ చేశారు, మార్చి 26న సమావేశాలు ముగియనున్నాయి.

ఇక మంత్రి హరీష్ రావు బడ్జెట్ పద్దులకు సంబంధించిన ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు, పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు.

 

బడ్జెట్‌లో ముఖ్య కేటాయింపులు ఇలా ఉన్నాయి:

  • వ్యవసాయ శాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయింపు
  • రైతు బంధు పెట్టుబడి సహాయ పథకానికి 14,800 కోట్లు
  • త్వరలోనే రైతు రుణ మాఫీ, ఇందుకోసం రూ. 5,225 కోట్లు
  • పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి రూ. 29,271 కోట్లు
  • పశుసంవర్ధక విభాగానికి రూ. 1,730 కోట్లు
  • నీటిపారుదల శాఖకు రూ. 16,931 కోట్లు
  • సమగ్ర భూ సర్వే కోసం రూ. 400 కోట్లు
  • ఆసారా పెన్షన్ల కోసం రూ. 11,728 కోట్లు
  • కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ. 2,750 కోట్లు
  • నిరుపేద ఓబిసిల కోసం కళ్యాణ లక్ష్మీ పథకం కోసం రూ. 500 కోట్లు

ఎస్సీ, ఎస్టీ మరియు ఓబిసి సంఘాల సంక్షేమం కోసం ప్రత్యేక ఆర్థిక ఉద్దీపనను ఆర్థిక మంత్రి ప్రకటించారు.

  • ఎస్సీ సంక్షేమ నిధికి రూ .21,306.85 కోట్లు
  • ఎస్టీ సంక్షేమ నిధికి రూ .12,304.23 కోట్లు
  • ఎస్టీ గృహాల విద్యుత్ సబ్సిడీ కోసం రూ .18 కోట్లు
  • 3 లక్షల గొర్రెల సేకరణకు రూ. 3000 కోట్లు
  • పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ. 2,363 కోట్లు
  • సాంస్కృతిక, ప‌ర్యాట‌క రంగాల‌కు రూ. 726 కోట్లు
  • ఐటీ రంగానికి రూ. 360 కోట్లు
  • డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ. 11 వేల కోట్లు
  • మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు
  • నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి రూ. 610 కోట్లు
  • వైద్య, ఆరోగ్య శాఖ‌కు రూ. 6,295 కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ. 11,046 కోట్లు
  • సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు
  • హోంశాఖ‌కు రూ. 6,465 కోట్లు

హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సభను మార్చి 20, శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదం తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్రానికి రూ.50,000 కోట్ల నష్టం వాటిల్లిందని, దీని ప్రభావంతో మొత్తంగా రాష్ట్రానికి ఆర్థికంగా రూ.1 లక్ష కోట్ల నష్టానికి దారితీసిందని సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల ద్వారా వివిధ రూపాల్లో ఆదాయం పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొందని పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్‌తో పోల్చితే ప్రస్తుత బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు జరుగుతాయని సీఎం కార్యాలయం పేర్కొంది.