Former CBI JD Lakshmi Narayana (photo-Video Grab)

Hyd, Mar 15: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ పరిణామాలపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ (Lakshmi Narayana on Kavitha Arrest) స్పందించారు. 161 సీఆర్పీసీ ప్రకారం మహిళలు విచారణ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, విచారణ అధికారులే మహిళల వద్దకు వస్తారని వివరించారు.

గతంలో ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి పిలిచారని, దాంతో కవిత తరఫు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అయితే... తాము కవితను విచారిస్తున్నది పీఎంఎల్ఏ చట్టం కింద అని, సీఆర్పీసీకి.. పీఎంఎల్ఏకి తేడా ఉందని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపిందని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని తెలిపారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి త‌ర‌లించిన అధికారులు, క‌విత ఇంటిముందు హైటెన్ష‌న్

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీ ఎలా తరలిస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా లక్ష్మీనారాయణ స్పందించారు. "సాధారణంగా మహిళలను సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అలా అరెస్ట్ (BRS MLC Kavitha arrest) చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది సీఆర్పీసీలో ఉండే సాధారణ ప్రొసీజర్ అని తెలిపారు.

అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎలా హాజరుపర్చాలన్నది క్రిమినల్ ప్రొసీజర్ లో ఈ విధంగా ఉంటుంది. ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు, ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశామో ఆ వ్యక్తికి సంబంధించిన ఒకరికి సమాచారం అందించాలి. తాము ఎవరికి సమాచారం అందించామనేది కేస్ డైరీలో రాయాలి. కేస్ మెమో అందించి వాళ్ల సంతకం కూడా తీసుకోవాలి. అన్వేష్ కుమార్ కేసులో తీర్పు అనంతరం ఇలాంటి విషయాలపై స్పష్టత వచ్చింది. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాల్లో ఉంటే, రేపు మేజిస్ట్రేట్ ఎదుట ఆ ఆదేశాలను కవిత న్యాయవాదులు సమర్పించవచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేస్తే మాత్రం అది సబబు కాదు" అని పేర్కొన్నారు. ఈడీ అధికారుల‌తో కేటీఆర్ వాగ్వాదం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ నిల‌దీసిన కేటీఆర్ (వీడియో ఇదుగోండి)

ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను దెబ్బతీసే ఉద్దేశంతో ఈ అరెస్ట్ చేశారన్న వాదనలపై కూడా మాజీ జేడీ స్పందించారు. ఒకవేళ, ఇందులో రాజకీయ అంశాలు ఉన్నాయని కవిత భావిస్తే ఆ అంశాలను రేపు మేజిస్ట్రేట్ ఎదుట ప్రస్తావించవచ్చని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో రాజకీయ ప్రేరేపితంగా ఇలా అరెస్ట్ చేశారన్నది వారు తమ వాదనల్లో పేర్కొనవచ్చని అన్నారు. అయితే, ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న సమయంలో కానీ ఎవరినీ అరెస్ట్ చేయకూడదని ఎక్కడా నియమావళిలో లేదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. కానీ, ఇలాంటి సమయంలో అరెస్ట్ చేస్తే మాత్రం కచ్చితంగా ప్రజల్లో చర్చకు వస్తుందని అన్నారు.