Hyd, Feb 25: మహబూబాబాద్ జిల్లాలో యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్‌కేసులో నలుగురు నిందితులను (Four including police constable) పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని బెదిరించి నిందితులు లొంగదీసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ కానిస్టేబుల్, ఓ ఎంపీటీసీ భర్త, మరో ఇద్దరు ఉన్నారు. నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ వివరాలు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు గ్రామానికి చెందిన ఓ యువతిపై ఈనెల 17వ తేదీ రాత్రి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి (gang rape case in Mahabubabad) పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె 18న ఉదయం ఇంటి వద్దే పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. యువతి ఆత్మహత్య లేఖలో రాసిన నిందితుల పేర్ల ఆధారంగా నెల్లికుదురు పోలీసులు విచారణ చేపట్టారు. వెంటనే అనుమానితులు ముగ్గురిని అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడైన కానిస్టేబుల్ పరారీలో ఉండడంతో, అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు జరిపి గురువారం పట్టుకున్నాయి.నిందితులు నలుగురిని గురువారం రిమాండ్‌కు తరలించారు.
యువతిని నిందితులు లొంగదీసుకున్న తీరును ఎస్పీ వివరించారు. ఆలేరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సద్దాం హుస్సేన్ కొంతకాలం క్రితమే మాయమాటలతో యువతిని లొంగదీసుకున్నాడు. ఆమెను అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. ఇది తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన యాట సాగర్ (ఆటోడ్రెవర్), ఎస్కే నజీమ్ (ఎంపీటీసీ భర్త,) కోయలకొండ జగదీశ్(వ్యాపారి) కూడా సదరు యువతిని లొంగదీసుకోవాలని భావించారు. ఆ అవకాశం కోసం వేచిచూస్తున్నారు. ఈనెల 16న రాత్రి సమయంలో యువతి తన స్నేహితురాలి ఇంట్లో నిద్రించడానికి వెళ్ల్లి తిరిగి మరుసటి రోజు తన ఇంటికి వచ్చింది.
మళ్లీ 17న రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లగా సాగర్, నజీమ్, జగదీశ్.. బాధిత యువతితో ఫోన్‌లో మాట్లాడారు. ‘నీకు ఇతరులతో శారీరక సంబంధం ఉంది. ఈ విషయాలను మీ నాన్నకు, సోదరుడికి చెప్పి బజారుకీడుస్తామని బెదిరించారు. తమ వద్దకు వస్తే మాట్లాడుకుందామని చెప్పగా, ఆమె భయపడి వారి దగ్గరకు వెళ్లింది. ఆ రోజు రాత్రి ఓ ఇంట్లో ఆమెపై ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. 18వ తేదీ తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న సదరు యువతి.. ఉదయం ఇంట్లో పురుగుల మందుతాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. యువతి మృతిని ప్రత్యేక కేసుగా పరిగణించి, దర్యాప్తును వేగంగా పూర్తి చేసి నిందితులకు కఠినశిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఈ బాధిత యువతి తల్లి ఆమె చిన్నప్పుడే మరణించిందని, ఈమె తండ్రి ట్రక్కు డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఇంటర్ వరకూ చదివినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్నది. ఇంతలోనే ఈ దారుణ ఘటనను తట్టుకోలేక మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.