Hyderabad, July 20: సింగరేణి కార్మికులకు (Singareni workers) తెలంగాణ సీఎం కేసీఆర్ తీపి కబురు వినిపించారు. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును (Singareni Workers Retirement Age) 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ మేరకు పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనుంది. దీంతోపాటు రామగుండంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం (CM KCR) నిర్ణయించారు. వీటికి సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు’ అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సమీక్ష చేసిన అనంతరం పలు అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ విప్ మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆంత్రం సక్కు, సిర్పూర్ ఖాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.