Hyd, Jan 24: తెలంగాణలో డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే (Door to Door Fever Survey) జరుగుతోంది. రెండు రోజుల్లో దాదాపు 29 లక్షల ఇళ్ల నుండి సమాచారాన్ని సేకరించారు. కాగా వీరిలొ 1.28 లక్షల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి అక్కడికక్కడే కరోనా కిట్లను అందజేశారు. సర్వేలో మొత్తం 1.28 లక్షల మందికి జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించి, వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను అందించారు. తమకు లక్షణాలున్నా కానీ, భయంతో బయటకు చెప్పేందుకు ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు.
ఈ రకంగా చూస్తే ప్రతి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు (Telangana Health teams) పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువ మంది ప్రైవేటు క్లినిక్ లను ఆశ్రయిస్తుండడంతో అవన్నీ లెక్కల్లోకి చేరడం లేదు. కాగా కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వరసర్వేకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కోరుతున్నారు. జ్వర సర్వేను పకడ్బందీగానిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని చింతకుంట, కరీంనగర్‌లోని రేకుర్తి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో ఇంటింటి జ్వర సర్వేను అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలన్నారు. కొవిడ్ మొదటి, రెండో డోసు వాక్సినేషన్లు తీసుకున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, జ్వరంతో బాధపడుతున్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్ ఔషధ కిట్లు అందించాలని సర్వే బృందాలను ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారు తప్పని సరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వస్తే మందులు వాడాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మున్సిపల్, స్వశక్తి, మహిళా సంఘ సభ్యులు ఆర్‌పీలు సమన్వయంగా సర్వేను సక్రమంగా నిర్వహించాలన్నారు.
సర్వే చేపట్టి మూడు రోజులవుతుందని, మరో రెండు రోజుల్లో సర్వేను పూర్తి చేయాలన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సువారందరికి కొవాగ్జిన్ వాక్సిన్ అందించాలన్నారు. కొవిడ్ మూడో దశ ఒమిక్రాన్ ప్రాణాంతకం కాకున్నప్పటికి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, నగర పాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్, వైద్య సిబ్బంది, సర్వే బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో కూడా ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జలుబు, దగ్గు వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గి తరువాత జ్వరంగా మారుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి నలుగురిలో ఇద్దరు జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా క్యూకడుతున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో మూడు రోజులకు మించి జ్వరం ఉన్నవారు భయాందోళనకు గురౌతున్నారు. వైరల్ జ్వరాలతోపాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఇంటింటికి వచ్చి ఫివర్ సర్వే చేయాలని, జ్వరం ఉన్న వారికి తగిన మందులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.