Hyderabad, April 10: తెలంగాణలో తాజాగా 2,909 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ (coronavirus in telangana) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 584 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరింది.
ఇప్పటివరకు మొత్తం 3,04,548 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,752గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17,791 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 11,495 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 487 మందికి కరోనా సోకింది.
తెలంగాణలో ప్రజలు మాస్క్ ధరించకుండా కనిపిస్తే, పోలీసులు వారికి రూ. 1000 జరిమానాగా (Rs 1,000 fine for no mask in public place) విధిస్తున్నారు. నిత్యమూ ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ, మాస్క్ లు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. మాస్క్ లేకుండా తిరిగేవారి చిత్రాలను సేకరిస్తూ, వారికి ఆన్ లైన్ మాధ్యమంగా జరిమానా రసీదును ఇస్తున్నామని, జరిమానా చెల్లించకుంటే, డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టంలోని సెక్షన్ 51 (ఏ) కింద వారిని కోర్టులో హాజరు పరుస్తామని స్పష్టం చేశారు.
వారిపై వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ప్రతి రోజూ కనీసం రెండు వేరువేరు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు తెలిపిన అధికారులు, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు జరుగుతున్నాయన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా, ప్రజలు లెక్క చేయడం లేదని తమ తనిఖీల్లో తేలిందని అంటున్న పోలీసులు, వాహనాలపై వెళుతున్న వారు కూడా మాస్క్ లను ధరించడం లేదని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలతో ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమని, ప్రజలు సహకరించాలని కోరారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నుంచి మాస్‌్కలు లేని వారికి జరిమానాలు విధించే స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిత్యం రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. మాస్కులు ధరించకపోతే కరోనా విస్తరించే అవకాశం ఉందని ఒక వైపు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తుంటే చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తాజా తనిఖీల్లో బయటపడిందని పోలీసులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా వాహనదారులు మాస్‌్కలు ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూటరిస్ట్‌లు 50 శాతం మంది మాస్‌్కలు లేకుండానే దర్జాగా దూసుకుపోతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. ప్రస్తుతం రెండు చోట్ల నిర్వహిస్తున్న తనిఖీలు వచ్చే వారానికి నాలుగైదు చోట్ల నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
కొంత మంది నిర్లక్ష్యం వల్ల వేలాది కుటుంబాలకు కరోనా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై నేనే రంగంలోకి దిగుతా. పబ్‌లు, క్లబ్‌లను ఆకస్మికంగా పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న యాజామాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. నేను మాస్క్ ధరిస్తే నీకు రక్షణ, నువ్వు మాస్క్ ధరిస్తే నాకు రక్షణ, ఇలా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం దేశానికే రక్షణ’’ అని సీపీ సజ్జనార్ (Cyberabad CP Sajjanar) అన్నారు.
గచ్చిబౌలి కమిషనరేట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటించేవారు దేశభక్తులన్నారు. మాస్కులను పట్టించుకోని దుకాణదారులపైన, వినియోగదారులపైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.
కరోనా సెకండ్ వేవ్ ను హైదరాబాద్ వాసులు సీరియస్ గా తీసుకోవడం లేదని, ప్రజలు ఇలాగే ఉంటే, కఠిన చర్యలు తీసుకోక తప్పదని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ( CP Anjani Kumar) హెచ్చరించారు. నిత్యమూ కేసులు పెరిగిపోతుంటే, ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోక తప్పేలా లేదని ఆయన అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుమారు కోటి మందికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులను ఎవరూ లెక్క చేయడం లేదని అభిప్రాయపడ్డారు.
కరోనా మహమ్మారి పట్ల నిరంతరం అప్రమత్తత అవసరమని, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను ఎంతమాత్రమూ పాటించడం లేదని, స్వీయ రక్షణ, తమ కుటుంబీకుల రక్షణ గురించి ప్రజలు మరిచారని అన్నారు. మాస్క్ లు లేకుండా వీధుల్లో తిరిగితే కేసులు నమోదు చేయక తప్పదని హెచ్చరించారు. రానున్న పండగల సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని, కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‌గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. కాగా ఈ నెల 28న నిమ్స్‌లో ఆయన కోవిడ్ టీకా తొలిడోసు వేసుకున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగా ఈ నెల 7న ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి పార్థసారథి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.