Hyd, Mar 7: తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేయనున్నారు.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.
కాగా తెలంగాణ ధూం ధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్( Rasamai Balakishan )కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించగా, రెండేండ్ల క్రితం ప్రముఖ కవి, రచయిత గోరటి వెంకన్న( Goreti Venkanna )కు ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. తాజాగా కవి, రచయిత దేశపతి శ్రీనివాస్( Deshapati Srinivas )కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.