Hyd, Feb 10: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదని... అనుముల అన్నదమ్ముల కోసం, అదానీల కోసం పని చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో KTR మాట్లాడుతూ, తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన సాగుతోందని (KTR Slams CM Revanth Reddy) విమర్శించారు.
కొడంగల్‌లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారని, కానీ అది జరగలేదన్నారు. రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా? అని నిలదీశారు.
కొండగల్ శాసనసభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ (BRS MLA KTR Open Challenge to CM Revanth Reddy) చేయాలన్నారు. ఉప ఎన్నికలో తాము ప్రచారం చేయమని చెప్పారు. ఫలితాల్లో రేవంత్ 50వేల కంటే తక్కువ మెజార్టీతోనే గెలుస్తారని తెలిపారు. 50వేల కంటే ఎక్కువ ఓట్లతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ వెల్లడించారు.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 50,000 ఓట్ల మెజారిటీ తక్కువగా వచ్చినా, తాను రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎప్పుడు బొంద పెడదామా అని ఎదురుచూస్తున్నారని, ఆయనపై ప్రజల ఆగ్రహం అంతగా పెరిగిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 25 శాతం రైతులకు రుణమాఫీ ఇంకా జరగలేదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.మా హయాంలో 73 వేల కోట్ల రూపాయలను 12 సార్లు రైతుల ఖాతాలకు రైతుబంధు పథకానికి అందించామన్నారు. ఇది రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం చేసిన కృషి అని తెలిపారు. కానీ ప్రస్తుతం రైతులకు ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి 17,500 రూపాయలు బాకీ ఉందని, ఈ మొత్తాన్ని త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అల్లుడికి కట్నం కోసం లగచర్ల భూములు గుంజుకున్నాడు. కుట్రతో అదానీకి,తన అల్లుడి కంపెనీకి భూములు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయించారు.లగచర్ల బాధితుల తరపున బీఆర్ఎస్ ఢిల్లీలో పోరాడింది. గిరిజనులు తలచుకుంటే రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో మళ్లీ గెలవడన్నారు.