
Hyd, Feb 28: గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి సైందవ పాత్ర (CM Revanth Reddy Slams union Minister Kishan Reddy) పోషిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు చీకటి మిత్రులు అని అభివర్ణించారు.
కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదన్నారు. ‘‘మీరు ప్రత్యేకంగా తెలంగాణకు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఏంటో చెప్పండి కిషన్ రెడ్డి గారూ.. నోరు వేసుకొని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడెవరూ లేరు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులను (Irrigations Projects) కిషన్ రెడ్డి అడ్డుకొంటున్నారు. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మేం ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తుల్ని అడగడంలేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళ్తున్నాయి. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదు. బిహార్, ఉత్తరప్రదేశ్‌కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకి ఇవ్వరా? అని మోదీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోన్న ప్రాజెక్ట్‌లకు అనుమతులు ఇస్తేనే తెలంగాణకు రావాలని కిషన్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. కేంద్రం ప్రత్యేకంగా తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఇన్ని సార్లు ముఖ్యమంత్రి వచ్చి అడుగుతోన్నా.. మీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం తమను ఎందుకు అడగడం లేదని మోదీ కేబినెట్‌లోని మంత్రులు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ద్వారా బలమైన పునాదులు వేస్తామన్నారు. పేద వారికి కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. కార్యకర్త మనసు ఎరిగిన నాయకురాలు మీనాక్షీ నటరాజన్ అని ఆయన తెలిపారు.రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసే వరకు విశ్రమించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
పదవులు రాని వారు నిరుత్సాహపడవద్దని, కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. నాలుగైదేళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన వారికి కూడా ఉన్నత పదవులు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, మార్చి 10వ తేదీ లోపు జిల్లాల వారీగా ఇంఛార్జ్ మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు ఎక్కువ, తక్కువ అనే తారతమ్యాలు లేవని ఆయన వెల్లడించారు. అనుభవజ్ఞులైన ఇద్దరిని ఇప్పటికే రాజ్యసభకు నామినేట్ చేశామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.
ఏ రాష్ట్రంపైనా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దు. మన మాతృభాష తెలుగు పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం అన్ని జీవోలను తెలుగులో కూడా ఇస్తోంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీట్లు తగ్గవు అంటున్నారు.. కానీ పెరుగుతాయని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. డీలిమిటేషన్ పేరిట దక్షిణాదికి అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని ఆ రాష్ట్రాల సీట్లతోనే అధికారంలోకి రావాలని భాజపా చూస్తోంది. ఇప్పటికే నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తూ.. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు. సీట్లు రాని దక్షిణాది రాష్ట్రాలను మాత్రం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు’’ అని విరుచుకుపడ్డారు.
దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండంటూ కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు .. బీసీ కేటగిరిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కోసం మంద కృష్ణను బీజేపీ కౌగిలించుకుందన్నారు. అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదంటూ బీజేపీ నేతలను ఆయన బల్లగుద్దీ మరి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడడం వల్లే తెలంగాణకి అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.