Hyderabad, Oct 6: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు (Coronavirus in Telangana) దాటింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైన ఏడు నెలల రెండు రోజులకు బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 1,335 మందికి కోవిడ్ వైరస్ (New Covid Cases) నిర్ధారణ అయింది. కొత్తగా 8 మంది ప్రాణాలు (New Covid Deaths) కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,00,611గా ఉంది. మృతుల సంఖ్య 1,171కు చేరింది. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 262 నమోదవగా, మేడ్చల్‌లో 91, రంగారెడ్డి జిల్లాలో 137, కరీంనగర్‌లో 83, నల్లగొండలో 72 పాజిటివ్‌లు నమోదయ్యాయి.
తాజాగా 2,176 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం రికవరీలు 1,72,388కు చేరాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లక్షణాలు కనిపించడంతో ఆమె ఆదివారం పరీక్షలు చేయించుకున్నారు. కొద్దికాలంగా సెలవులో ఉన్న రాజేశ్వరి ఇటీవలే విధుల్లో చేరారు. మూడు రోజుల క్రితం జిల్లా అధికారుల సమావేశంలో కూడా పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణలో ఆర్- వాల్యూ మాత్రం క్రమంగా తగ్గుతుంది. కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి సగటున ఎంతమంది ఇతర వ్యక్తులకు వైరస్ సంక్రమించిందన్న విషయాన్ని ఆర్- వాల్యూ (రీ ప్రొడక్షన్) తెలియజేస్తుంది. దీని ద్వారా వైరస్ వ్యాప్తి తీవ్రతపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో ఆర్- వాల్యూ ఆగస్టు మూడవ వారంలో 1.27 ఉండగా, అది సెప్టెంబర్ మూడవ వారంలో కేవలం 1 కి పడిపోయింది.
ఈ సంఖ్య భారత సగటు 0.86 కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, నిపుణులు రాష్ట్రంలో సంక్రమణ వ్యాప్తి భయంకరమైన దశలో లేదని, క్రమంగా తగ్గుతున్నదని చెప్పారు. నిజానికి ఆర్- వాల్యూ ఒకటి కంటే తక్కువగా ఉండటం ప్రజల ఇమ్యూనిటి పవర్ మెరుగు పడుతుందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19 సోకిన వ్యక్తి సగటున ఒకరి కంటే తక్కువగానే వ్యాధి వ్యాప్తి చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.