COVID Status in TS: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో నేడు మరియు రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సెలవు, తెలంగాణలో కొత్తగా 189 కొవిడ్19 కేసులు నమోదు, రాష్ట్రానికి సంబంధించి కొవిడ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి
Corona Vaccination (Photo-Twitter)

Hyderabad, January 26: తెలంగాణలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు మరియు రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సెలవు ప్రకటించారు. తిరిగి గురువారం నుంచి రాష్ట్రంలో యధావిధిగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

నిన్న సోమవారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే హెల్త్ వర్కర్స్ కి టీకాలు అందించడం మొదలైంది. అయితే ప్రైవేట్ సిబ్బంది నుంచి వ్యాక్సిన్ పట్ల స్పందన కరువైంది, తమ పేర్లు నమోదు చేసుకున్న వారిలో తొలిరోజు కేవలం 47.4 శాతం మాత్రమే టీకా పట్ల ఆసక్తి చూపించారు. టీకా పట్ల కొందరిలో అనుమానాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే, భయం పోగోట్టడానికి కొంతమంది ప్రముఖ వైద్యులు నిన్న టీకాలు తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ కూడా కొవిడ్ నివారణ టీకా వేయించుకున్నారు.

రాష్ట్రంలో కరోనా  కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 29,449 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 189 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75,741,84 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,93,590కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 38 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 12, మేడ్చల్ నుంచి 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,592కు పెరిగింది. అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 349 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,88,926 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,072 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.