Hyderabad, January 4: తెలంగాణలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. కొత్త సంవతరం, వారాంతం వరుసగా సెలవులు రావడంతో టెస్టులు కూడా తక్కువగా చేశారు. ఇక మరోవైపు కరోనా నిర్మూలన కోసం వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 10 వేల మంది సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందినట్లు చెప్పారు. మూడు విడతల్లో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ అవసరం లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 27,077 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 238 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 525 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70,18,564 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 287,740కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా స్వల్పంగా 60 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో పదిరోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.