
Hyderabad, January 12: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకా ఏర్పాట్లను సీఎం కేసీఆర్ సమీక్షించారు, టీకా అందించిన తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం సూచించారు. తొలివిడత కోవిడ్ టీకా పంపిణీ ఈనెల 16న నిర్వహించబడుతుంది. మొట్టమొదటగా వైద్య, ఆరోగ్య సిబ్బంది, ASHA కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది టీకా అందుకోనున్నారు. వీరి తర్వాత పోలీసులు, భద్రతా సిబ్బంది, శానిటరీ కార్మికులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులకు, ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి మరియు అనారోగ్య కారణాలు ఉన్నవారికి టీకా ఇవ్వబడుతుంది.
టీకా పంపిణీ సమయంలో ప్రజలను ప్రాధాన్యత ప్రాతిపదికన చేర్చే బాధ్యతను గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని, అలాగే పోలీసులకు మరియు ఇతర భద్రతా సిబ్బందికి వ్యాక్సిన్ తీసుకునే బాధ్యతను పోలీస్ స్టేషన్ హౌస్ అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్లు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 34,431 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 301 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 675 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73,12,452 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 290,309కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 58 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

