COVID-19 in India | (Photo Credits: PTI)

Hyderabad, May 11:  తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1196కు చేరింది. నిన్న ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో 26 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. యాదాద్రి జిల్లాలో తొలిసారిగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంతకాలంగా గ్రీన్ జోన్ గా కొనసాగిన జిల్లాలో 4 పాజిటివ్ కేసులు రావడంతో జిల్లాలో కలవరం మొదలైంది. వీరంతా ఇటీవలే ముంబై నుంచి తిరిగి వచ్చినవారేనని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 751 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే గత 24 గంటల్లో ఎవరూ కూడా డిశ్చార్జ్ కాకపోవడంతో ఆ సంఖ్య అలాగే ఉంది. కొత్తగా కరోనా మరణాలేమి కూడా లేకపోవడంతో రాష్ట్రంలో కోవిడ్-19 మరణాలు 30గానే ఉన్నాయి. కొత్తగా పాజిటివ్ కేసులు రావడంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య 415కు పెరిగినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో వారి ద్వారా ఇతర రాష్ట్రాలకు కరోనావైరస్ వ్యాప్తి చెందుతుంది. విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్ రప్పిస్తున్న క్రమంలో రానున్న కాలంలో కోవిడ్-19 కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. అయితే లక్షణాలు ఉండే ప్రతి ఒక్కరికి టెస్టులు, లక్షణాలు కనిపించని వారిని రెండు వారాల పాటు క్వారైంటైన్ లో ఉంచతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.

ఇదిలా ఉండగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ స్థితిగతులపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ కేబినేట్ భేటి తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ కొన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి ఈరోజు జరిగే జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం ఎలాంటి వైఖరి అవలంబిస్తారో వేచి చూడాలి.