Hyderabad, May 19: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,837 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 594 కొత్త కేసులు (GHMC Covid) నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,976 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 25 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,40,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,90,620 మంది కోలుకున్నారు.
ఇంకా 46,946 మందికి కరోనా చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 3,037కి చేరింది. కాగా, జాతీయస్థాయిలో కరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా, తెలంగాణలో 0.56 శాతంగా నమోదైంది. దేశంలో రికవరీ రేటు 86.2 శాతం కాగా, తెలంగాణలో 90.75 శాతంగా ఉంది. కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న వేళ టెస్టులు పెంచాల్సి ఉండగా.. రాష్ట్రంలో మాత్రం తగ్గించారు. గతంలో రోజుకు లక్ష టెస్టులు చేయగా.. ఇప్పుడు 50 నుంచి 70 వేలే చేస్తున్నారు. ఇక ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్ టెస్టులను తగ్గించడంతో ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు.
కొవిడ్ టీకాల సరఫరాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. షార్ట్ టెండర్ నోటుఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక వసతుల సంస్థ ద్వారా 10 మిలియన్ డోసుల వాక్సిన్‌ను ప్రభుత్వం సేకరించనుంది.
Here's TS Covid Report
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.19.05.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/ax7Sf6lM32
— IPRDepartment (@IPRTelangana) May 19, 2021
బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా నిర్ణయించింది. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వాక్సిన్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వం కండిషన్ విధించింది. సప్లయర్ నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా సప్లై చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల మందికి వాక్సిన్ వేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. గ్రేటర్లో 2,04,490 ఇళ్లలో బల్దియా ఫీవర్ సర్వే చేసింది. ఇప్పటి వరకూ గ్రేటర్ హైద్రాబాద్‌లో 1,18,8362 ఇళ్లలో ఫీవర్ సర్వే పూర్తైంది. 317 బస్తీ ఆసుపత్రులలో ఓపీ ద్వారా ఈ రోజు 17,301 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ మొత్తం 2,37,188 మందికి ఫీవర్ పరీక్షలు చేశారు. ఫీవర్ సర్వేలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం.