Hyderabad, May 18: తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈనెల 30 వరకు పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వం ముందు ప్రకటించిన లాక్‌డౌన్ గడువు శుక్రవారంతో ముగియనుంది. అలాగే మంత్రులు జిల్లాల్లో ఉంటూ క్షేత్ర స్థాయిలో కోవిడ్ నియంత్రణ చర్యల అమలును పర్యవేక్షిస్తుండటం, లాక్‌డౌన్ రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ పొడగించే అంశంపై మంత్రులందరికీ ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తీసుకున్న ముఖ్యమంత్రి అనంతరం మే 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే లాక్‌డౌన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడున్న మాదిరిగానే ఉదయం 6 నుంచి 10 వరకు సడలింపు ఉంటుంది. ఉదయంం 10 తర్వాత యధావిధిగా లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని సీఎంఓ స్పష్టం చేసింది. ఇక, లాక్ డౌన్ పొడగింపు నిర్ణయం జరిగిపోవడంతో ఈ నెల 20న భేటి కావాల్సిన రాష్ట్ర కేబినేట్ రద్దు అయింది.
ఇదిలా ఉంటే, తెలంగాణలో నమోదయ్యే రోజూవారీ కోవిడ్ కేసుల్లో గణనీయమైన మార్పులేమి లేవు. ఇటీవల కాలంగా సుమారు 4 వేల లోపు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,616 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,982 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,164 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,36,766కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 607 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 225 కేసులు, రంగారెడ్డి నుంచి 262, ఖమ్మం నుంచి 247 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 27 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3012కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 5,186 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,85,644 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
తెలంగాణలో 'ఆయుష్మాన్ భారత్' పథకం అమలు
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు ప్రభుత్వ వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.