Hyderabad, May 20: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా మరో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1634 కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 34 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో కరోనా బారినపడిన వారి సంఖ్య 77 కు చేరుకుంది.
మంగళవారం ఒక్కరోజే నలుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 38కి చేరింది. మరోవైపు, నిన్న మరో 9 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1011 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 585 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
సుమారు 2 నెలల తర్వాత లాక్డౌన్-4లో మరిన్ని సడలింపులు లభించడంతో మొదటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. సెలూన్లు, బట్టల షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు తదితర వాటిల్లో సందడి వాతావరణం కనిపించింది. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. అయితే బస్సుల్లో ఎక్కువగా ప్రయాణికులు కనిపించలేదు. చాలావరకు బస్సులు ఖాళీగానే తిరిగాయి, అయితే హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు మాత్రం ఎక్కడా ఖాళీ లేకుండా తిరిగాయి. లాక్డౌన్ కారణంగా నగరంలో చిక్కుకున్న వారంతా ఒక్కసారిగా ఊర్ల బాట పట్టారు. చాలా రోజుల తర్వాత అనుమతి లభించడంతో ఆటోవాలాలు ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా రాష్ట్రం లాక్డౌన్ కి ముందు పరిస్థితుల్లోకి వెళ్లినట్లు కనిపించింది. అయితే కర్ఫ్యూ అమల్లో ఉండటంతో సాయంత్రం 6 తర్వాత ఎక్కడివారక్కడ ఇళ్లకు చేరుకున్నారు.