Hyderabad, May 11: తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా విజృంభన కొనసాగుతోంది. అయితే ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో మాత్రం గణనీయమైన మార్పులేమి లేవు. కేసులు సుమారుగా 5 వేల లోనే ఉంటున్నాయి. మరోవైపు రికవరీల సంఖ్య పెరుగుతుండటం ఊరట కలిగించే విషయం. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఆక్టివ్ కేసులు ఇంకా 60 వేలకు పైగానే ఉన్నాయి. కేసులు మరింత పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్ డౌన్ విధించింది. ప్రతిరోజు 20 గంటల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుండగా, మిగతా 4 గంటలు ప్రజల రోజూవారీ అవసరాల కోసం సడలింపులు కల్పించింది. తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుండటంతో ప్రయాణ ప్రాంగణాలు, దుకాణాలు, మార్కెట్లలో రద్దీ పెరిగింది.
అయితే అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడం ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. వలసకూలీలు వారి వారి నివాస ప్రాంతాలకు చేరుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరింది. రాష్ట్రంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని సూచించింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వైద్యం కోసం వస్తున్న అంబులెన్సులను అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్, ఇక నుంచి ఎలాంటి అంబులెన్సులను అడ్డుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. లాక్డౌన్ మార్గదర్శాకాల ఎలా ఉన్నాయో ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. నిన్న రాత్రి 8 గంటల వరకు 75,289 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 4,801 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,878 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,06,988కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 756 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 327 కేసులు, రంగారెడ్డి నుంచి 325, నల్గొండ నుంచి 254 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 32 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,803కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 7430 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,44,049 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60,136 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.