Hyderabad, May 12: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తగ్గుకుంటూ వచ్చిన COVID19 పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిన్నమొన్నటి వరకు 10-20గా నమోదవుతూ వచ్చిన కేసులు సోమవారం నాడు మరింత పెరిగి ఒక్కరోజులోనే 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే ఇదే అత్యధికం. గతంలో ఒకసారి 75 కేసులు నమోదవడం ఒకరోజులో అత్యధికంగా చెప్పబడ్డాయి. అయితే ఇవన్నీ కూడా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. రెడ్ జోన్ గా కొనసాగుతున్న హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ అనవసరంగా బయట తిరిగేవారితో రోడ్లపై రద్దీ కొనసాగింది. ఇటీవల కేంద్రం లాక్డౌన్ ఆంక్షలు సడలించడం, మద్యం దుకాణాలకు అనుమతి లభించడం, దీంతో రద్దీ మరింత పెరగడం. ఇప్పుడు వాటి ఫలితంగానే కేసుల సంఖ్య పెరగడానికి కారణమా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారితో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది అనేది ఊహించిందే. అయితే గత 24 గంటల్లో వలస వచ్చిన వారిలో గానీ, జిల్లాల నుంచి గానీ ఒక్కకేసు నమోదు కాలేదు. కానీ కేసులు తగ్గుతున్నాయి అనుకుంటున్న వేళ హైదరాబాద్ నగరంలో ఇన్ని పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. నగరంలో ఒక్క జియాగూడ నుంచే 25 కేసులు నమోదైనట్లు అధికార వర్గాల నుంచి తెలిసింది. తాజా కేసులతో రాష్ట్రంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 1275కు పెరిగింది.
COVID-19 in Telangana:
మరోవైపు, సోమవారం మరో 50 మంది కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా ఇప్పటివరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 801కి పెరిగింది. కొత్తగా మరణాలేమి నమోదు కాకపోవటం కొంత ఊరట కలిగించే విషయం. రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 30గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 444 ఆక్టివ్ కేసులు ఉన్నాయని చెబుతూ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో కలిసే సాధారణ జీవితం సాగేలా పక్కా వ్యూహం రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టింది. అయినప్పటికీ కేసులు ఎక్కువగా రావడంతో ఇక ప్రభుత్వం నగరంలో ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా మరోసారి కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది.