COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, April 28:  తెలంగాణలో కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో రోజురోజుకి గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం నుంచి కేవలం 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అవి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే వచ్చినవి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య మంగళవారం ఉదయం నాటికి 1003 కి చేరింది. నిన్న సోమవారం మరో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు, కొత్తగా మరణాలేమి నమోదు కాలేదు. మరణాల సంఖ్య 25 గానే ఉంది.

అయితే, ఒకవైపు కేసులు తగ్గుతున్నా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజు పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 556 కేసులు గ్రేటర్ పరిధిలోనివే. జిల్లాల నుంచి కేసులు రాకపోయినా, జీహెచ్ఎంసీ నుంచి పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

హైదరాబాద్ తర్వాత సూర్యాపేట, గద్వాల్ మరియు వికారాబాద్ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు.

జిల్లాల వారీగా నమోదైన కేసులు ఇలా ఉన్నాయి:

status of positive cases of #COVID19 in Telangana.

 

దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ ... ‘‘రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ వచ్చిన వారు సోమవారం నాటికి 1003 మంది కాగా, అందులో 332 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 పాజిటివ్ కేసులున్నాయి. మొత్తం పది జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు.

మరో 11 జిల్లాలు జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ నేటితో (ఏప్రిల్ 28 నాటికి) ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారనున్నాయి.

హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరస్ సోకిన వారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్ పీరియడ్ మే 8 నాటికి ముగుస్తుంది. కొద్ది రోజులుగా పరిస్థితి గమనిస్తుంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క పాజిటివ్ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతున్నది. ఆ తర్వాత అక్కడో ఇక్కడో కొద్దో గొప్పో కేసులు వచ్చినా వెంటనే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.