TSRTC indefinite strike updates | |Representational Image | File photo

Hyderabad: ఆర్టీసీ సమ్మె  (TSRTC Strike) హైకోర్టులో తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ఇకపై సమ్మె కొనసాగించాలా? ముగించాలా? అనేదానిపై ఆర్టీసీ జేఏసీ (RTC JAC) మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశం ముగిసింది. అయితే రేపు హైకోర్ట్ (High Court of Telangana) తుది తీర్పు వెలువరించిన తర్వాత కోర్టు ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించి ఆపై ఎలా ముందడుగు వేయాలనే దానిపై సమ్మెపై నిర్ణయం ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) పేర్కొన్నారు. అప్పటివరకు సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

సమ్మె భవిష్యత్ కార్యాచరణపై ఈరోజు ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సమావేశం ఏర్పరుచుకున్నాయి. ఆయా యూనియన్ నేతలు డిపోల వారీగా కార్మికుల నుంచి అభిప్రయాలను సేకరించింది. ఐకాస నిర్ణయం ఎలా ఉన్నా అందుకు కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాలు హామీ ఇచ్చాయని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. కాగా, ఈ సమ్మెలో భాగంగా ఆత్మబలిదానం చేసుకున్న కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వత్థామ రెడ్డి హామి ఇచ్చారు.

ఇరకాటంలో పడ్డ కార్మిక సంఘాలు, సమ్మె పట్ల తర్జనభర్జన

46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టినా ఎలాంటి ఫలితం రాలేదు, హైకోర్ట్ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నీరుగారిపోయాయి. ప్రభుత్వం సూచించినట్లుగానే ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు బదిలీ చేసే అవకాశం ఉండటంతో కార్మిక సంఘాలు ఇరకాటంలో పడ్డాయి. మళ్లీ అటు తిరిగి, ఇటు తిరిగి సమ్మె వ్యవహారం ప్రభుత్వం చేతుల్లోకే వెళ్తున్నట్లు అవుతుంది.

ఇటు ప్రైవేటీకరణ అంశంలో పట్ల కూడా హైకోర్ట్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నాయి. అటు ప్రారంభంలో మేమున్నాం, సమ్మె కొనసాగించండి అంటూ ప్రోత్సహించిన ప్రతిపక్ష పార్టీలూ ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. దీంతో ఆర్టీసీ జేఏసీ పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది.

పోనీ, సమ్మె విరమణ ప్రకటన చేసినా, ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందా? ఉద్యోగ భద్రత ఏంటి? అనే దానిపై తీవ్ర అంతర్మదనంలో ఉన్నారు జేఏసీ నేతలు. ఒకవేళ సమ్మె విరమించినా ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో అప్పుడెలా ముందుకెళ్లాలి, కార్మికులకు ఎలాంటి భరోసానివ్వాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతానికి ప్రభుత్వం వేచి చూసే ధోరణిలో ఉంది. ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె పట్ల తమ తుది నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అప్పుడేదైనా ఆలోచిద్దాం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో విధుల్లో చేరమని రెండు సార్లు గడువు విధించిన కార్మికులు బేఖాతరు చేయడంతో ఇప్పుడు సమ్మె విరమణ ప్రకటన చేసినా, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.

ఒకవేళ కార్మికులు బేషరుతుగా విధుల్లో చేరేందుకు ఒప్పుకుంటే, అందుకనుగుణంగా లిఖితపూర్వక ప్రమాణ పత్రాలను స్వీకరించి, అంతకుముందు సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణ కోసం ప్రతిపాదించిన అంశాలకనుగుణంగానే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అర్ధ భాగం ప్రైవేట్ రూట్లకు అప్పగిస్తూనే, మిగతా అర్ధభాగం ఆర్టీసీ కిందకు చేర్చే సూచనలు ఉన్నాయి.

అయితే ఇదంతా రేపు హైకోర్ట్ తీర్పు ఆధారంగా, కార్మిక సంఘాల ప్రకటనను బట్టి ప్రభుత్వం స్పందించే అవకాశం  ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.